ఏవేవో పనుల వంకతో పొద్దున్నే బయలుదేరిన జనాలని ఎక్కించుకుని రాష్ట్ర రాజధాని నుండి దేశ రాజధానికి వెడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌ప్రెస్‌ మధ్యలో కాసేపు కాజీపేటలో ఆగింది. కొత్తగా పదవీ విరమణ చేసినందువలన కలిగిన విశ్రాంతితోనూ, ఆ తాలూకు డబ్బులొళ్లో పడ్డందువల్ల వచ్చిన ఆనందంతోనూ, జవసత్వాలింక రిటైరవలేదులే అన్న ధీమాతోనూ కళకళలాడిపోతున్న ఒక సరికొత్తసీనియర్‌ జంట రైలెక్కారు. మనం తరచూ చూస్తూనే వుంటాం. కొత్తగా రిటైరయ్యారని ఎవరూ చెప్పక్కర్లేనట్లుగా వుంటారు నూతన వధూవరులల్లేనే! వాళ్లని రైలెక్కించడానికని వచ్చిన కుర్రాడు కిటికీ ఊచలు పట్టుకుని వేళ్లాడు తుండగానే ఆయన ఒక్కడే చకచకాసామాన్లన్నీ సర్దేసి కాస్త గర్వంగా ‘‘ఏమిటనుకున్నావ్‌?’’ అన్నట్లు భార్యకేసి చూశాడు.

ఆవిడేం ఆయన్ని పట్టించుకోకుండా, ‘‘వెళ్లొస్తారా శ్యామూ! ఇల్లు జాగ్రత్త! అమ్మతో చెప్పు.... జానీ కోసం చిన్న ప్యాకెట్టు చాలు. పది రోజుల్లో వచ్చేస్తాం. ఎక్కడ్నించైనా ఫోన్లు చేస్తూ వుంటాంలే’’ ఆవిడ అప్పగింతలు పూర్తవకుండానే రైలు బయలుదేరింది.ఎనిమిది మంది తెల్లవార్లూ చచ్చినట్లు పడుకుని ప్రయాణించడానికి వీలుగా డిజైను చేసిన ఆ స్లీపరు పెట్టె భాగంలో మిగతా ఆరుగురూ సికింద్రాబాదులోనే ఎక్కి అప్పటికే సెటిలయిపోయారు. అదృష్టం కొద్దీ అక్కడ ఒక ముద్దులు మూట గట్టే ఒక రెండేళ్ళ పిల్లాడూ, వాడి అమ్మానాన్నలు తప్పించి మిగతా వారంతా నడి వయసులో వున్నామనుకుంటున్న వాళ్లే. వాడొక్కడే స్టార్‌ ఎట్రాక్షను. పిల్లలతో ప్రయాణం, అదీ పరాయి పిల్లలతో ప్రయాణం అంటే ఎవరికన్నా భయమే! మూడేళ్ల లోపు వాళ్లు ఇద్దరు ముగ్గురున్నారంటే చచ్చారన్నమాటే ప్రయాణికులు. వాళ్లకి అమ్మపక్క తప్ప వేరే బెర్తులుండవు కదా! వాళ్లు అల్లరాపరు. తల్లులు పట్టించుకోరు. మరీ ఎక్కువయితే నోట్లో ఏదో కూరుతూ వుంటారు. అవి తిని వాళ్లు ఇంకా విజృంభిస్తుంటారు. మన వాళ్లకి అంటే శ్రీమతి మరియు శ్రీకృష్ణమూర్తి గారివి సైడు బెర్తులు. అరవైకి ఆర్నెల్లు తక్కువయిన వాళ్లని సైడ్‌ అప్పర్‌ బెర్త్‌ ఎక్కించడం రైల్వే వాళ్లకి భలే సరదా. 

అసలు రైలు టిక్కెట్లిచ్చేటప్పుడు మనిషి వయసుతో బాటు బరువు కూడా రాయాలని చెప్పి ఆ ప్రకారం బెర్తు ఎలాట్‌చేస్తే ప్రయాణీకులకి జరిగే అన్యాయంలో కొంత వరకయినా తగ్గించవచ్చని వాళ్లకెందుకు తోచదో!ఇద్దరూ పెళ్లిళ్లలో దండాడింపుకి కూచున్నట్లుగా ఎదురుబదురుగా మఠం వేసుక్కూచున్నారు. ఆయన చేతిలో గీతాసారాంశమూ, ఆవిడ చేతిలో ఎవరిదో బోధనామృతమూ, పెద్దపెద్ద బైండు పుస్తకాలు ఎంత ప్రయాణానికయినా సరిపడేంత వున్నాయి. దీక్షగా చదవాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఎంత సాధన చేసినా అదేవిటో పేజీ తిప్పడమే అవట్లేదు. ఇదేవన్నా అమ్మాయిలు మిల్స్‌ అండ్‌ బూన్స్‌ చదివినట్లా! ఆ సాధనలో భాగంగా మధ్యమధ్యలో చదివింది వంటబట్టించుకోవడానికన్నట్లు కిటికీలోంచి బయటకు చూస్తున్నారు. ముందు ఆయనే ఓడిపోయాడు. ఆ పుస్తకం అక్కడ పడేసి ఆవిడని కదిపే ప్రయత్నం చేశాడు.