చెట్టునిండా పిందెలు, పిందెలు కాయలవుతాయి. కాయలు పళ్లవుతాయి. మధుర రసాలవుతాయి. అందరి దృష్టీ ఆ చెట్టుపైనే వుంటుంది. ఆకుల మధ్య అణిగి మణిగి వుండక బాహాటంగా ప్రదర్శనకు దిగుతున్నట్లున్నాయు మామిడి పిందెలు. ఎన్ని ఆకులు కావాలో ఆ పిందెల్ని దాచడానికి!

నీరెండ తగ్గింది. ఎక్కడ్నించో ... ఏనుగుల గుంపుల్లాంటి నల్ల మబ్బులు! ఒకదానినొకటి తరుముకుంటూ... ఘీంకరిస్తూ... ఆకాశపు అంచుల్ని పట్టుకుని వేలాడుతున్నాయి. వాటిని తరిమికొట్టే గాలి... వెర్రిగాలి! చూస్తుండగానే ప్రకృతిలోని రంగులన్నీ కలగాపులగమై నలుపురంగులోకి మారిపోతున్నాయి. తూర్పున ఒక మెరుపు ఆకాశాన్ని రెండుగా చీలుస్తూ జిగేల్మంది. కాస్సేపట్లోనే భయంకరమైన ధ్వనితో ఉరుము!ఆనందంతోనో, ఆందోళనతోనో వూగిపోతోంది చెట్టు... తన సర్వసంపదల్నీ మానవాళికే అందించే చెట్టు!గాలిజోరు మరింత హెచ్చింది. ఎక్కడో రేకులు ఎగిరిపడిన చప్పుడు. ప్రకృతి అతిభయంకరంగా విజృంభించి వెర్రితలలేస్తున్న నాగరికతమీద పట్టునాదే అని చెబుతున్నట్లుగా గాలి. చూస్తుండగానే గాలీ వానా జమిలిగా కమ్మేశాయి లోకాన్ని.

అంతే! పెళపెళ్లాడుతూ చెట్టువిరిగి ఒరిగిపోయిందొక వైపు. కొమ్మే విరిగిందో మానే విరిగిందో, మిన్ను విరిగి పడ్డట్టు అతడి మీద పడింది.కళ్లు బైర్లు కమ్మేయి. మెదడు మొద్దుబారింది. అలాగే ఉండిపోయాడు.కుండపోతగా వర్షం! అలా ఎంతసేపు కురిసిందో... ఎప్పుడు వెలిసిందో...! చుట్టూ మూగిన జనం మాటలు లీలగా విన్పిస్తున్నాయి. మహావృక్షం కూలిపోయింది...! పాపం ప్రాణం వుందోలేదో...! కొమ్మలు నరికిగాని బయటకు తియ్యలేం... అదిగో... సన్నగా మూలుగు!... ప్రాణం వుండే వుంటుంది. ఎంతైనా పెంచిన చెట్టుకదా... ఆపాటి కనికరముండదా దానికి!కాలూ, చెయ్యీ కదపాలని ప్రయత్నిస్తున్నాడు.

అతికష్టం మీద కుడికాలు కదిలింది. చేతుల వేళ్లు కూడా! కళ్లు తెరిచాడు!కిటికీలోంచి సూర్యోదయం! పాలవాడు తలుపు కొడుతున్నాడు!ఫఫఫపాండురంగ శూన్యంలోకి చూస్తూ తెల్లవారుఝామున వచ్చిన కల గురించి ఆలోచిస్తున్నాడు. అతను కూర్చున్న చోటునించి చెట్టు కనబడకపోయినా శూన్యంలో ఆ చెట్టు దర్శనమిస్తూనే వుంది. ఆకాశంలో మినుకు మినుకుమనే నక్షత్రాల్లా ఎదిగీ ఎదగని పిందెలు!జవం, జీవంతో పచ్చగావున్న ఆ చెట్టు నిండుగా కనులకింపుగా కన్పిస్తోంది. తనతో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్టుగా అన్పిస్తోంది. మనిషితో చెట్టుకి మాటలా? అసలు మనిషికీ చెట్టుకీ మధ్య స్నేహముంటుందా?