అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష..అని కొంతమంది మన భారతీయ పురాతన విజ్ఞానాన్ని ఎద్దేవా చేస్తారు. పురాతనమైనా, సనాతనమైనా, అధునాతనమైనా ఆ విజ్ఞానమే, సారూప్యతలు కలిగిన ఆ ఆంశాలే మళ్ళీమళ్ళీ కొత్తగా సరికొత్తగా చెప్పుకుంటూ, ‘ఇది కొత్త ట్రెండ్‌ తెలుసా?’, ‘ఇది న్యూ ఇయర్‌ ట్రెండ్‌ తెలుసా?’ తెగ ముచ్చటపడిపోతూ ఉంటారు చాలామంది. పాతవిషయాల్నే కొత్తసీసాలోపోసి పులకించిపోతాం. కావాల్సింది అదేనా? లేక ఆచరణా? ఈ కథలో ఏం జరిగిందంటే....

అది ఒక అందమైన సాయంకాలం.ఏటవాలుగాపడుతున్న సూర్యకిరణాలతో బంగారురంగులో అందంగా, హుందాగా దర్శనమిస్తున్నాయి అక్కడి పురాతన కట్టడాలు. ఓ పక్కన సూర్యుడు తన ప్రయాణాన్ని ఆ రోజుకి ముగించి పశ్చిమానికి దిగిపోయే సమయం దగ్గర పడుతూ ఉంది. అంతలో ఒక టూరిస్ట్‌ బస్‌ దుమ్మురేపుకుంటూ వచ్చి ఆగింది అక్కడ. దానిలోనుంచి పర్యాటకులు జంటలు జంటలుగా దిగసాగారు. వారిలో ప్రత్యూష్‌, శర్మిష్ఠ కూడా ఉన్నారు. ఆఫీస్‌ కొలీగ్స్‌ అందరూ కలిసి ఏర్పాటుచేసుకున్న మధ్యప్రదేశ్‌ పర్యటనకు వచ్చారు.

అది ఇండోర్‌ పట్టణంలోని ఒక ముఖ్యమైన పర్యాటక ప్రాంతం. వాళ్ళ పదిరోజుల పర్యాటన ప్రణాళిక ముగింపుదశకు వచ్చింది. భోపాల్‌, మండు, మహేశ్వర్‌, ఉజ్జయిని వంటి పర్యాటకప్రదేశాలు సందర్శించి చివరకు ఇండోర్‌ వచ్చారు. బస్‌ దిగిన ఆడవాళ్ళలో చాలామంది మోడ్రన్‌ డ్రెస్సుల్లోనే ఉన్నారు. ఒకరిద్దరు డ్రెస్‌లు వేసుకున్నారు. ఒక్కరంటే ఒక్కరుకూడా చీరలో లేరు! వస్త్రధారణ చూడడానికి అందంగానూ, శరీరానికి సౌకర్యంగానూ ఉంటే చాలని వాళ్ళ ఉద్దేశం. భారతీయ సంప్రదాయ వస్త్రధారణపట్ల వాళ్ళల్లో చాలామందికి ఆకర్షణా లేదు, అభిమానమూ లేదు!అందరూ కిందకు దిగారని నిర్ధారణ చేసుకున్నాక గైడ్‌ వాళ్ళందరినీ ఒకచోటచేర్చి చెప్పాడు. ‘‘ఇది రేవా సొసైటీ. ఇక్కడ మధ్యప్రదేశ్‌ సంస్కృతిని ప్రతిఫలించే హస్తకళావస్తువులు దొరుకుతాయి. కొనడం మానడం మీ ఇష్టం. ఎలాంటి నిర్భంధం ఉండదు. కానీ మీరు కనీసంచూస్తే వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పదండి చూపిస్తాను’’ అంటూ అటు దారితీశాడు.ప్రత్యూష్‌ నవ్వుతూ చూశాడు శర్మిష్ఠవైపు.‘‘ఏవేవో కొనిపించాలని చూస్తారు ఈ గైడ్‌లు. నాకైతే ఈ చీరలు అవీ కొనాలని లేదు. ఇప్పుడు ఎవరు కడతారుచెప్పు ఈ చీరలూ అవీనూ’’ శర్మిష్ఠ మొఖం చిట్లిస్తూ అంది.