ఆ బెమ్మ లాచ్చసి ఎలిపోయిందా తాతా? అని ముద్దు ముద్దుగా అడిగింది ఆ పిల్ల వాళ్ళ దొడ్లోకి తొంగి చూస్తూ. ఆ మాటవిని అతడికి నవ్వాగలేదు. ఆమెను ఎత్తుకుని ముద్దాడి, గాల్లోకి ఎగరేస్తూ, ఆ బెమ్మలాచ్చసి ఎలిపోయింది ఇక మనం హాయిగా ఆడుకోవచ్చు...అన్నాడు కేరింతలు కొడుతూ. ఇక ఆ మర్నాటినుంచీ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా పదహారుమంది పిల్లలు! ఆ దొడ్లోనే ఆటలాడుకోవడం ప్రారంభించారు. ఇంతకీ ఆ పిల్ల ఎందుకలా అడిగిందంటే....

 

మగాడు అదృష్టవంతుడైతే అతగాడికో ప్రేయసి దొరుకుతుంది.గొప్ప అదృష్టవంతుడైతే ఆ ప్రేయసి అతనికి బాల్యంలోనే దొరుకుతుంది. మహాగొప్ప అదృష్టవంతుడైతే పుట్టుకతోనే ప్రేయసి దొరుకుతుంది. నేను మహాగొప్ప అదృష్టవంతుణ్ణిలెండి! ప్రేయసి అనగానే ఓ రంభో ఊర్వశో అయి ఉండనవసరం లేదు. కుంటిదో గుడ్డిదో కూడా కావచ్చు. ఆ ప్రేయసికి మాత్రం మగాడు నచ్చితేచాలు. నా ఖర్మకొద్దీ నేను మంచి అందగాణ్ణి కూడా కావడంవల్ల ఆ ప్రేయసికి పిచ్చిపిచ్చిగా నచ్చేశాను.

 

లోకంలో మగాళ్లకి పెళ్ళాల్ని మెయిన్‌టైన్‌ చేయడం వీజీయేగానీ, ప్రేయసిని మెయిన్‌టైన్‌ చేయడం అంత వీజీయేంకాదు. కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళకైతే తప్ప. కానీ నేను కృష్ణదేవరాయలుకి కనీసం దూరపు కజిన్నైనా కాకపోవడంవల్ల నా ప్రేయసిని భరించడం నా తలకిమించిన భారమైపోయింది. అయినా భరించక తప్పలేదు. ఆవిడగారు వచ్చేవరకూ, ఆవిగారు వచ్చాకా ప్రేయసి తప్పుకోక తప్పదుగా. లేకపోతే నిత్యం సిగపట్ల గోత్రమే కదా. తన మొగుడికి లక్ష్మీదేవి ప్రేయసి అయితే ఆవిడ హర్షిస్తుందిగానీ జేష్టాదేవి ప్రేయసి అయితే ఏ ఆవిడ భరిస్తుంది గనుక. ఏం, చాలా నా గురించి ఈ ఆధార్‌ వివరాలు?ఆవిడగారు వచ్చాకా, ఆవిడ నాయకత్వాన నా పుట్టుప్రేయసిని ఒదిలించుకునేందుకు ఒ పుష్కరకాలం పట్టింది. నాకు నడివయసూ, బట్టతలా వొచ్చేశాయి. ఓ కత్తిలాంటి మగపిల్లాడికీ, చురకత్తిలాంటి ఆడపిల్లకీ తండ్రిని కూడా అయ్యాను. కత్తులు, చురకత్తులూ గుండెల్లో లోతైనగాయాలు చేస్తాయనే ఇంగిత జ్ఞానం కరువైన అజ్ఞానంతో, జేష్టాదేవి బిగికౌగిట్లో నలిగిపోవడంవల్ల నా పిల్లల బాల్యాల్నీ, వాళ్ళ ముద్దూముచ్చట్లన్నీ సవ్యంగా ఆనందించలేకపోయానే అనే బాధ, ఫీలింగూ నన్ను రాచపుండులా సలుపుతూ ఉండేవి. అందుకే కనీసం తాతగా అయినా నా మనవల అపురూపమైన బాల్యానుభూతుల్ని తనివితీరా ఆనందించాలని బాగా ఆశపడ్డాను. కానీ అది అత్యాశ అంటున్నారు నా కత్తీ, చురకత్తెలు!