‘‘నువ్వొచ్చావేంటీ? మీ నాన్న రాలేదా?’’‘‘మా నాయనకు ఒంట్లో బాలేదు’’ అన్నాడు బస్సు స్టీరింగ్‌ ముందు కూర్చున్న ఇరవైఏళ్ళ రసూల్‌, నిర్లక్ష్యంగా మొహంపెట్టి.‘‘అయ్యో...ఏంటీ జ్వరమా?’’ అడిగింది ఆమె, ఏడేళ్ళ తన కూతుర్ని స్కూల్‌ బస్సు ఎక్కిస్తూ సానుభూతిగా.‘మాయరోగం...’ మనస్సులోనే కసిగా గొణుక్కున్నాడు రసూల్‌. తొమ్మిదింటిదాకా దుప్పటి ముసుగెట్టి పడుకునేవాణ్ణి పొద్దున్నే నిద్రలేపి, ఇలా డ్యూటీకి పంపాడని తండ్రిమీద పీకలదాకా కోపం అతడికి. పొంగుతున్న కోపాన్ని మింగలేక కక్కలేక సతమతమవుతున్నాడు.

తండ్రిమీదున్న కోపం, అసహనం అంతా యాక్సిలేటర్‌ మీద చూపిస్తూ గట్టిగా తొక్కేసరికి డబడబమంటూ శబ్దాలు చేస్తూ బస్సు ముందుకు కదిలింది.ఇక్ష్వాకుల కాలంనాటి ఆ స్కూల్‌ బస్సుకి ఎంత ఫిట్‌నెస్‌ ఉందో ఆ పరమాత్ముడికే తెలియాలి. బస్సు నడుస్తుంటే డబ్బాలో గులకరాళ్ళేసి శబ్దం చేసినట్టు వింత ధ్వనులు చేస్తూ ఉంటుంది. ఇక బ్రేక్‌ తొక్కితే రెండువందల అడుగులదూరం వెళ్ళాక మెల్లగా ఆగుతుంది ఆ బస్సుకు సంబంధించి అదే సడన్‌ బ్రేకన్నమాట.శీతాకాలం కావటంవల్ల ఏడుగంటలవుతున్నా ఇంకా సూర్యుడు పూర్తిగా బయటకు రాలేదు. వాతావరణం చల్లగా ఉంది. గాలినిండా మిళితమైన మంచు, ఆహ్లాదకరంగా వీస్తున్న ఆ గాలి చక్కిలిగిలి పెడుతున్నట్టు హాయిగా ఉంది.

బస్సులో కూర్చున్న స్కూల్‌ పిల్లలు తమదైన ప్రపంచంలో మైమరచి ఉన్నారు.కొందరు కిటికీలోంచి అప్పుడప్పుడే బైటకొస్తున్న సూర్యుడిని చూస్తున్నారు. ఇంకొందరు ఊరు బయట పొలాల దగ్గర అక్కడక్కడా కనబడుతున్న రంగురంగుల పక్షుల్ని, పువ్వుల్ని ముఖమంతా విప్పార్చుకుని ఆసక్తిగా, కుతూహలంగా గమనిస్తున్నారు. రోజూ స్కూల్‌కి వెళ్ళే దారిలో ఉదయం, సాయంత్రం వాళ్ళకు ఆ దృశ్యాలు మామూలే. కానీ ఏరోజుకారోజు అదే మొదటిసారి అన్నట్టు ఆస్వాదిస్తూ ఉంటారు పిల్లలు. బాల్యం తాలూకు అమాయకత్వపు మైమరపు ఓ అదృష్టం కదా!