కాలిఫోర్నియాలో తన ఇంట్లో పెంచుకున్న చిన్న తోటవైపే చూస్తోంది ఆమె. ఆ తోటలో పూచిన ఎర్రమందారంపువ్వులపైనే ఆమె దృష్టిసారించింది. పిల్లగాలికి మంద్రంగా తలలు ఊగిస్తున్నాయి ఎర్రమందారంపువ్వులు. ఆమె మనసులో జ్ఞాపకాలు కూడా అలాగే ఉన్నాయి. కాల, ప్రదేశాలకు అతీతంగా, సప్తసముద్రాలూ దాటి ఇక్కడిదాకా వచ్చింది ఆ మందారమొక్క. ఆత్మీయతకు, తన పుట్టింటి జ్ఞాపకాలకు ప్రతిబింబిం ఆ మొక్క....

*************************

ఆమెని ఎల్లలు లేకుండా ప్రేమించిన ఆమె తండ్రి వెంకట్రావు ఇకలేడు.నాన్న మరణంతో అతని జీవితానికే కాకుండా, తన బాల్యానికి కూడా అంతిమతెర పడినట్లు విజయకి అనిపించింది. తొందరలోనే ఆ ఇల్లు, ఇంటి పెరటిలో ఉన్న చిన్నతోట, అందులో అడ్డుదిడ్డంగా పెరిగిన ఎర్రమందారంమొక్క, ఆకాశాన్నంటేలా ఎదిగిన కొబ్బరిచెట్టూ, గుబురుగా కాయలతో నిండి ఉన్న మామిడిచెట్టూ అన్నీ కూడా శాశ్వతంగా తమ చేతినుండి వెళ్లిపోతాయి. ప్రొద్దున్నే లేచి ఒకసారి ఇంటి చుట్టూ తిరిగి వచ్చిన విజయకి ఈ విషయం తలుచుకోగానే ఏడుపు వచ్చింది.మాయదారి గుండెపోటు మొట్టమొదటిసారే వెంకట్రావుని చావుచూసేలా చేసింది. అందువల్లేనేమో విజయకి నాన్నచావుగురించి ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. వెంకట్రావు రూమ్‌లో తలుపు వెనకాల హుక్‌కి ఆయన తెల్లచొక్కా, ధోవతి ఇంకా అలాగే వేళ్ళాడుతూ ఉన్నాయి.

మల్లెపూవుల్లాంటి తెల్లటిధోవతి, పైన తెల్లటి సిల్క్‌చొక్కాలో వెంకట్రావు ఎప్పుడూ తాజాగా, గంభీరంగా, ఠీవిగా కనిపించేవాడు. ఆ తెల్లటిదుస్తులు తన తెల్లవెంట్రుకలతో చాలా బాగా మ్యాచ్‌ అవుతున్నాయని ఎప్పుడూ విజయ నాన్నని ఆట పట్టిస్తూ ఉండేది.వెంకటరావు గారంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎంతో గౌరవం. విజయకైతే నాన్నంటే ప్రాణం. ఆయన అంతిమ ఘడియల్లో తన పిల్లలెవరూ తనతో లేకపోయిన విషయం, విజయకి చాలా బాధ కలిగించడమే కాకుండా, ఈ విషయంగురించి ఆయన చనిపోయిన రోజునుంచీ విజయ అపరాధభావంతో తనలో తాను క్రుంగిపోతోంది.ముఖం కడుక్కుని కాస్త ప్రెష్‌ అయిన తర్వాత విజయ తన భర్త ప్రసాద్‌ని వెతుక్కుంటూ బయటికి వెళ్ళింది. తన అన్నయ్య శ్రీనివాస్‌ పక్కనే కూర్చున్న భర్తను చూసి, తను కూడా అక్కడే ఒక ప్లాస్టిక్‌ కుర్చీలాక్కుని కూర్చుంది. అమెరికాలో సెటిలయ్యాక తామందరూ బాగా రంగుతేలడమే కాకుండా, మనదేశంలో ఉన్నప్పటికంటే కాస్త ఒళ్ళు చేశామని కూడా విజయ మనస్సులో అనుకుంది.