బాధ్యతలు తీరిపోయాక, పదవీ విరమణ చేసిన వయసులో కాలం చాలా భారంగా గడుస్తుంది చాలామందికి. ఖాళీగా ఇంట్లో కూర్చుంటే లేని రోగాల్ని ఆపాదించుకుంటూ, ఉన్నరోగాలు తగ్గడం లేదని డాక్టర్లను తిట్టుకుంటూ, మందుల్నీ, డాక్టర్లనీ మారుస్తూ అనేక రకాలుగా కాలక్షేపం చేస్తారు. కానీ ఈ కథలో విశాలాక్షమ్మగారు, కోదండరామయ్యగారూ మాత్రం చాలా భిన్నంగా ఆలోచించారు. వాళ్ళేంచేశారంటే..

‘టంగ్‌’, ‘టంగ్‌’...టంటంటంటింగ్‌టింగ్‌....ఎన్ని శబ్దాలో! శంకర్‌ జయకిషన్‌ మ్యూజిక్‌లా మ్రోగుతూపోతున్నాయి. ఇంతలో డబుల్‌ బారల్‌గన్‌ నుంచి వచ్చిన తూటాల్లా పరుగు పరుగున విశాలక్ష్మమ్మ, ‘‘ఎవరక్కడ..’’ అని అరిచిపారేసింది.ప్రాణాలన్నీ బిక్కచచ్చి ఇద్దరు చిన్నఅబ్బాయిలు వీధి గడపమీద నిలబడి ఉండడం చూసిందావిడ. ఆ అమాయకపు మొహాలు చూడగానే ఆవేశం కాస్త తగ్గి, ‘‘ఎవర్రా ఈ పని చేసింది’’ అని అరిచింది.

 

అసలే కోదండరామయ్య కూరకనివెళ్ళి రెండుగంటలైనా తిరిగిరాలేదని కోపంగా ఇంట్లోకి బయటికి తిరుగుతూ, తూలిపోతున్న ఆమెకు, తలుపుతెరచి ఉండటంవల్ల, పిల్లలు ఆడుకునే బంతి ఇంట్లోకి వచ్చిపడింది. భోజనాలగదిలో బోర్లించిన గ్లాసులన్నీ ఆ బంతిదెబ్బకు మృదంగాలు, వీణలుగా మారి ఒక్కసారి మ్రోగాయి.‘‘బామ్మగారూ! పొరపాటైంది. బంతి మీ ఇంట్లోకొచ్చిపడింది. క్షమించడి, ఇంకోసారి ఇలా చెయ్యంలెండి ప్లీజ్‌...మా బంతి...’’ అంటూ భయంతో నసిగారు పిల్లలు.‘‘బంతాట ఆడేటప్పుడు ఒళ్ళు తెలీదా, చూసుకోవక్కర్లా, ఈసారి బంతిపడితే కాళ్ళువిరిచేస్తా వెధవల్లారా!’’ అంటూ బాలు తెచ్చి ఇచ్చేసింది.ఇంతలో కోదండరామయ్య కూరలు తీసుకుని వస్తూనే ‘‘ఏమిటీ! తలుపులు బార్లా తీసి పారేశావ్‌’’ అన్నారు.

‘‘ఆ అదే మీకు స్వాగతం పలకాలని. చిటికెలో కూర పట్టుకొచ్చారుగా! అదే ఆశ్చర్యం, అందుకే...’’ఇంకా ఏదో అనేలోగా, ఆయన అందుకుని, ‘‘ఏం అంత రుసరుసగా ఉన్నావ్‌. అయినా ఆలస్యం అయితే ఏంటట. మనిద్దరం గబగబా పనులు కానిచ్చి ఏ ఉద్యోగానికన్నా వెళ్ళాలా? అయినదానికి కానిదానికి బి.పి. పెంచుకోకు. మధ్యాహ్నం రెండింటికి తింటాం. ఈలోగా చెయ్యలేవట్నే. దారిలో మన పాత ఇంటిపక్కనున్న సుందరేశం కనబడితే కాస్త కబుర్లలో దిగాం. దానికే ఇంత ధుమధుమలా!’’‘‘ఆలస్యంగా వచ్చిందిచాలక, సర్దుకోడం ఒకటి. ఏంచేస్తాం. ఎవరేంచేసినా నా పని నాకు తప్పదుగా!’’ అంటూ చేతిలోని సంచి లాక్కొని వంటింట్లోకి వెళ్ళింది విశాలక్షమ్మ.