ఆఫ్రికాలో మాలి దేశం. ఆ దేశ రాజధాని బొమేకోలో షెనూ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇండియాకి బయల్దేరబోయే విమానానికి బోర్డింగ్‌ అనౌన్స్‌ చేశారు.వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. రచేల్‌ భారమైన మనసుతో కదిలి, తన తల్లిదండ్రులవైపు నిర్లిప్తంగా చూసింది..

‘‘ఇండియాలో మహిళలకు సెక్యూరిటీ లేదమ్మా. ఎప్పటికప్పుడు వార్తల్లో చూస్తూనే ఉన్నాంకదా. నువ్వు రాత్రివేళల్లో ఒంటరిగా తిరగొద్దు తల్లీ. నీ ప్రయాణం క్షేమంగా జరగాలనీ, నువ్వు అనుకున్న పని నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాం తల్లీ....’’ చెప్పింది రచేల్‌ తల్లి ఉద్వేగంతో.‘‘థాంక్స్‌ మామ్‌..’’ అంటూ తల్లిని వాటేసుకుంది రచేల్‌. కూతురు నుదుటమీద ఆప్యాయంగా చుంబించిందామె. ‘‘మైడియర్‌ డాటర్‌, ఈ తల్లిదండ్రులను చూడడానికి మళ్ళీ వస్తావా తల్లీ?’’ నీళ్ళు నిండిన కళ్ళతో అడిగాడు తండ్రి. బేలగా అడుగుతున్న అతడిని చూడగానే మనస్సంతా భారంగా అనిపించింది రచేల్‌కు. ‘‘అలా అనకండి. నేను మీ కూతుర్ని. వారం పదిరోజులలో తిరిగి వచ్చేస్తాను. నన్ను ఆశీర్వదించండి’’ వంగి తండ్రికి పాదాభివందనం చేసింది.

సెక్యూరిటీ చెక్‌ వైపు నడుస్తున్న ఆమె వెనకెనక్కి చూస్తూ తల్లిదండ్రులకు చేయి ఊపుతూనే ఉంది. రచేల్‌ కనుమరుగయ్యేంత దూరం వెళ్ళేదాకా వాళ్ళిద్దరూ అక్కడే నిలబడి ఆమె వెళ్ళినవైపు చూస్తూనే ఉన్నారు. వాళ్ళ మనసులో అనేకానేక సందేహాలు, సంశయాలూ, కొట్టుమిటాటడుతూ సుడులు తిరుగుతున్నాయి. సుడిగుండాల్ని రేపుతున్నాయి. ‘చూస్తూండగానే రచేల్‌ కనుమరుగైపోయింది. ఈ దూరం శాశ్వతంగానా?ఏమో?’ భారమైన మనసుతో వెనుతిరిగారు వాళ్ళు. ఫ్లయిట్‌ రన్‌ వే మీద అమితవేగంతో ప్రయాణిస్తూ ఒక్కసారిగా టేకాఫ్‌ తీసుకుంది. భూమిని విడిచి నింగిలోనికి విహంగంలా దూసుకుపోసాగింది. నగరపు ఆనవాళ్ళు క్రమంగా బొమ్మరిల్లుల్లా అయిపోతున్నాయి. రచేల్‌ విండోలో నుంచి వాటిని చూస్తుందన్నమాటేగానీ, ప్రయాణాణ్ణి ఆస్వాదిస్తూ ఆనందించే స్థితిలో లేదు. మనసు ఉద్వేగంగా ఉంది. ఉద్విగ్నంగా ఉంది. ఉత్సాహంగా ఉంది. మాతృభూమిలో అడుగు పెట్టబోతోంది తను.