జరీనా అద్భుత సౌందర్య రాశి. రవివర్మకి చిక్కని అందం.ఆమె చిరునవ్వు చాలు, మనస్సు మయూరం కావడానికి.ఆమెని చూసిన ప్రతీసారీ సాకేత్‌ గుండెల్లో అలజడి.అంత సౌందర్యం ఎందుకు ‘అడవిగాచిన వెన్నెల’ అవుతుందా అన్నది అతడి సందిగ్ధం.

కాలిఫోర్నియాలోని ఒక యూనివర్శిటీలో ఫిజిక్స్‌ బోధిస్తుంటాడు సాకేత్‌.జరీనా ఆర్గానిక్‌ కెమిస్ట్రీ అధ్యాపకురాలు.ఎప్పుడు ఎదురైనా ఒక చిరునవ్వు విసిరివెళుతుంది తప్ప, అంతకుమించి అంగుళం జరుగదు.జరీనా అవివాహిత అని మాత్రం తెలుసు సాకేత్‌కి.కానీ ఎందుకలా ఉండిపోయిందో ఎవరికీ తెలీదు. ఒకరోజు ఆమెను అడిగాడు, ‘‘ఈ సండే మీ ఇంట్లో కాఫీ తాగాలనుకుంటున్నాను’’. ‘‘సారీ ‘సండే’ షాపింగ్‌ వెళ్తున్నాను’’ చెప్పింది నవ్వుతూ.ప్రతిసారీ కుంటిసాకులతో తప్పుకుంటుంది. ఎదురైనా సరిగ్గా మాట్లాడదు.అన్వేక్ష ఆంగ్ల అధ్యాపకురాలు. జరీనాకి సన్నిహితురాలు.జరీనా అంటే సాకేత్‌కు ఉన్న ఆసక్తిని ఆమె అనేకసార్లు గమనించింది. ‘‘ఎందుకీపాట్లు...’’ అతడిని అడిగిందొకసారి.

‘‘ఆ ప్రశ్నకు సమాధానం ప్రేమలోపడితే తప్ప ఎవరికీ తెలీదు...’’ అన్నాడు నవ్వుతూ.‘పిచ్చిమాలోకం...’ అని నవ్వుకుంది.ఇండియా నుండి వచ్చి అధ్యాపకవృత్తిలో స్థిరపడినవాళ్ళు ఆ యూనివర్శిటీలో వాళ్ళ ముగ్గురే. తప్పని పరిస్థితుల్లో కలుస్తూ ఉంటారు. అన్వేక్ష జరీనా ఒకే ‘ఫ్లాట్‌’లో ఉంటారు.‘‘సాకేత్‌ని ఎందుకు చంపుకు తింటావు. ఏదో ఒకటి చెప్పేయొచ్చు కదా?’’ జరీనాని ఒకసారి అడిగింది అన్వేక్ష. ‘‘చెప్పడానికి ఏమీ లేదు కదా’’ అంది ప్రతిగా.‘‘నువ్విలా పూలిష్‌గా బిహేవ్‌ చేయడం ఏమీ బాగాలేదు జరీ... జీవితమంటే జ్ఞాపకాల శకలం కాదు. వర్తమాన ప్రవాహం’’‘‘నీ పొయిట్రీ క్లాసులో చెప్పు, బావుంటుంది... నాకు కాదు’’ అంది నిరసనగా జరీనా.‘‘ఇంత అందంతో ఎందుకు పుట్టావే... మగజాతిని అల్లాడించడానికా?’’ అంది నవ్వుతూ అన్వేక్ష.