జుట్టు మీద ఒక చేత్తో నీళ్ళు స్ర్పే చేస్తూ ఇంకో చేత్తో లాఘవంగా దువ్వుతోంది దేవి. ఆమె మా హెయిర్‌ డ్రెస్సర్‌.‘‘దేవీ, మరీ బిగించి వెయ్యకు జడ. లూజ్‌ వదులు బిట్స్‌ ఎడ్‌జస్ట్‌ చెయ్యి ముందువైపు. లేదా స్క్రీన్‌ మీద మరీ బట్టతలలా కనిపిస్తుంది’’ అంటూ జడ ఎలా వెయ్యాలో విభావరి దేవికి చెప్తూనే ఉంది.

‘‘అమ్మా! ఇంతకుముందు సీరియల్‌లో కన్నా దీనితో మీరు అందంగా కనిపిస్తారు. నయనతార హెయిర్‌ స్టైలు చేస్తున్నా’’ అని జవాబిచ్చింది దేవి.స్క్రిప్టు రాస్తున్న నేను మధ్యమధ్యలో జరుగుతున్న సంభాషణ వింటూనే ఉన్నా.‘‘మేడం నా కేరెక్టర్‌ ఏం చేశారూ? మహేంద్రభూపతి నా తమ్ముడిని అమెరికా పంపించి పెద్దచదువులు చదివిస్తా అనగానే, లొంగిపోతానా?నెగిటివ్‌ చేసేస్తారా నన్నూ? జనాలు తిట్టి పోస్తారు మేడం. ప్లీజ్‌! కొంచెం నీతిగా ఉంచండి నన్ను’’ విభావరి మాట్లాడ్తూనే ఉంది.‘‘డైరెక్టర్‌ గారు పిలుస్తున్నారు’’ అన్నాడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వచ్చి.

రాస్తున్న సీన్‌పేపర్స్‌తో సహా అటెళ్ళాను.‘‘టీ.వీ. సీరియల్‌ అంటే ఇంటిల్లపాదీ చూసేది. బూతులు రాయకయ్య బాబూ!’’ డైరెక్టర్‌, డైలాగ్‌ రైటర్‌కి నచ్చచెప్తున్నాడు.‘‘మాది విజీకారం అండీ బాబూ, నీ తల్లీ అన్నది కామన్‌వర్డ్‌ ! బూతుకాదందీ బావూ!’’ అతను మొత్తుకుంటున్నాడు.నేను వెళ్లగానే ‘‘మేడమ్‌కి కొబ్బరి నీళ్ళు తీసుకురండిరా’’ అని కేకేసి కుర్చీ చూపించి ‘‘విభావరిని విలన్‌ని చెయ్యమని ఛానెల్‌వాళ్ళు గోలపెట్టేస్తున్నారు, ఈ అమ్మాయి వినడం లేదు! ఏం చేద్దాం మేడమ్‌?’’ అడిగాడు.నేను నవ్వి ‘‘విభావరి కాదు మంజరి, ఆస్తిని అనుభవించాలని మహేంద్రభూపతి కోరిక. కానీ ఒప్పుకోడం లేదు.