అతను తన తండ్రిని ఎంతగానో ప్రేమిస్తాడు. ఎందుకంటే అతడి తండ్రి త్యాగమూర్తి. తమకోసం తండ్రిచేసిన త్యాగాలన్నీ అతడి హృదయంలో ముద్రవేసుకున్నాయి. అదే సమయంలో తన స్నేహితుడి తండ్రి చేష్టలు కూడా అతడు గమనించాడు. తన తండ్రినీ, తన స్నేహితుడి తండ్రినీ పోల్చి చూసుకుని తన తండ్రి ఎంతో ఉన్నత సంస్కారంగలవాడని నిర్ధారించుకున్నాడు. కానీ అతడొక చిన్న విషయం మాత్రం మరచిపోయాడు. ఏమిటది?

**********************

నాన్నకి అరవై నిండాయి. షష్ఠిపూర్తి జరిపించమని అమ్మ ఒకటే పోరు.నిజానికది అమ్మసరదా కాదు. తను స్వయంగా చెప్పలేక నాన్నే అమ్మని నామీద ఉసిగొల్పుతున్నాడని నా భార్య అనుమానం.నాన్నంటే నాకు చాలాఇష్టం. ఈరోజు నేనిలా పచ్చగా ఉన్నానంటే ఆయనే ముఖ్యకారణమని నేనూ అనుకుంటూ ఉంటాను. కానీ ఆయనతోపాటు నా జీవనవిధానమూ, అలవాట్లూ కూడా కారణమని నాకు తెలుసు.పొగత్రాగను. మద్యం ఏం ఖర్మ, కాఫీ, టీలు కూడా ముట్టను. క్లబ్బులకీ, పేకాటలకీ దూరంగా ఉంటాను. వీటన్నింటినీ అమ్మకూడా మెచ్చుకుంటుంది. కానీ సంప్రదాయంపేరిట జరిగే పూజా పునస్కారాలకీ, వేడుకలకీ కూడా నేను దూరమే. అదే అమ్మకు నచ్చదు.పత్రికలు, టీవీ, సినిమాలు...ఇవే నాకు అదనపు కాలక్షేపాలు.శ్రావణ శుక్రవారం పేరంటాలు, సత్యనారాయణస్వామివ్రతాలు, కాశీయాత్ర సంతర్పణలు వగైరాలకు పిలుపు వచ్చినప్పుడు అమ్మ నొచ్చుకుంటుంది, అలాంటివి మనింట్లో ఎప్పుడురా అని.

వాటివల్ల సంపద మరిన్నిరెట్లు పెరుగుతుందనీ, వైభోగం పెరుగుతుందనీ అమ్మ ఉద్దేశ్యం.ఉన్న సంపాదనతో ఈ స్థాయిలో ఉన్నానంటే, అలాంటివి లేకపోవడమే కారణమని నేను అనుకుంటాను. షష్ఠిపూర్తి మాట ఎత్తొద్దని కాస్త మృదువుగానే అమ్మకు చెప్పేశాను. అలాంటి సమయంలో భాస్కర్‌నుంచి వచ్చిన ఫోను నన్ను విస్మయపరిచింది.‘‘నాన్నకి షష్ఠిపూర్తి ప్లాన్‌ చేశాను. అప్పుడే ఇది పిలుపు అనుకోకు. ఖర్చు అనుకున్నదానికంటే ఎక్కువయ్యేలా ఉంది. కాదనకుండా ప్రస్తుతానికి నువ్వు నాకో ముప్ఫైవేలు సర్దాలి’’.అదీ విషయం.‍భాస్కర్‌ నా చిన్ననాటి స్నేహితుడు. కాలేజీరోజుల దాకా ఇద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. అప్పట్లో మా ఇద్దరి పరిస్థితీ కూడా మధ్యతరగతికి కాస్త దిగువనే ఉండేది. భాస్కర్‌ తన తండ్రిగురించి ఇలాంటి ఫోన్‌ చేస్తాడని కలలోకూడా ఊహించలేదు నేను. ఎందుకంటే నేను మా నాన్నని చాలా ఎక్కువగా ఇష్టపడడానికి భాస్కర్‌ తండ్రే కారణం.