పగలంతా తను చేసిన గగన సంచారంలో ఈ పాపిష్టి ప్రపంచాన్ని చూసీచూసీ దోషం తగిలి కళ తరిగిపోయిన సూర్యభగవానుడు పడమటి మబ్బుల మాటున కనుమరుగవుతున్న సమయమది. అంతవరకూ ఎక్కడెక్కడో నక్కి ఉన్న దోమలన్నీ ఆ ప్రదేశంలో ఒక్కసారిగా స్వైరవిహారం ప్రారంభించాయి వేల సంఖ్యలో.... ముక్కులలోనూ, నోరు తెరిస్తే నోట్లోనూ దూరిపోతున్న దోమలు. అయితే ఆ ప్రదేశం మురుగుకాలువ కాదు. చెత్తకుప్ప అంతకన్నా కాదు. అదొక ప్రభుత్వ ఆసుపత్రి! పాలకుల బాధ్యతరాహిత్యానికీ పాలితుల దౌర్భాగ్యానికీ దర్పణం పడుతున్న ఒక ప్రభుత్వ ఆసుపత్రి!

అక్కడ రోగులకు చాలినంతగా పడకలు లేవేమో కొంతమంది రోగులను నేలమీదే దుప్పట్లు పరచి పడుకో బెడుతుంటారు. ఆ బహుళ అంతస్థుల భవంతికి లిప్టు సదుపాయం ఉన్నా అవి తరచు మొరాయిస్తుంటాయి. ఆ సమయంలో పై అంతస్థులకు చేరుకోవలసిన రోగులు పడ రాని పాట్లు పడుతుంటారు. వీధి కుక్కలు నాలుకలు చాపుకొని చొంగకారుస్తూ దినమంతా వార్డులలో తచ్చాడుతుంటాయి. మూత్రశాలలో అడుగు పెడితేచాలు ముక్కులు పగిలి పోయేటంత దుర్వాసన. ఎండిపోయిన ఎర్రటి తాంబూలపు మరకలతో వాష్‌ బేసిన్‌లు ఎంతో జుగుప్సాకరంగా కనిపిస్తుంటాయి. ఎక్స్‌రే యూనిట్‌లో తరచు ఎక్స్‌రే ఫిల్ములకు కొరతే. నాణ్యమైన కొత్తకొత్త ఔ‌షధాలు విపణి వీధిలో కనుపిస్తున్నా ఆ ఆస్పత్రిలో మాత్రం కానరావు.

ఆఖరుకు సెలైన్‌ స్టాండ్‌లు కూడా చాలినంతగా లేవేమో రోగుల సంబంధీకులే గంటల తరబడి సెలైన్‌ సీసాలను చేతబట్టుకొని ఉన్న దృశ్యాలు సర్వసామాన్యం. ఇక నర్సుల సంఖ్య కూడా రోగులకు చాలినంతగా లేదేమో పని భారంతో వాళ్ళు తరచు తమ సంయమనం కోల్పోతుంటారు. అది సహజమే మరి. ఇందుకు ఏలికలు చెప్పుకొనే సంజాయిషీ ఒక్కటే.‘నిధుల కొరత... తీవ్రమైన నిధుల కొరత. ప్రభుత్వానికి అవసరమైనన్ని నిధులు లేనేలేవు’.విపరీతమైన జ్వరంతో మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్న తన ఆరేళ్ళ కూతురిని పది దినాల క్రితం ఆ ఆసుపత్రిలో చేర్పించాడు లక్ష్మీపతి. వైద్యులు చూస్తూనే ఉన్నారు. ఔషధాలు యిస్తూనే ఉన్నారు. కానీ వ్యాధి దారి వ్యాధిదీ చికిత్సదారి చికిత్సదీ అవుతున్నది.

ఈ పది దినాలలోనూ పాపం బాగా శుష్కించి పోయింది. ఒంట్లో ఎముకలు పైకి తేలుతున్నాయి. కాళ్ళూ చేతులూ చీపురుపుల్లల్లా అయిపోయాయి. ఒంటిమీద వాలిన ఈగలను కూడా తోలుకోలేని స్థితిలో మగతగా పడి ఉన్న చిన్నారిని చూస్తుంటే కన్నవారికే కాదు చూపరులను కూడా హృదయం ద్రవిస్తున్నది. లక్ష్మీపతి చెప్పుల దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నాడు. ఒక్కరోజు పనిమానేసినా జీతంలో కోత విధిస్తాడు యజమాని. అందుకని యాంత్రికంగా పనిలోకి వెళ్ళి వస్తున్నాడు. రాత్రి పది గంటలకు దుకాణం నుంచి వస్తూ పగలంతా కూతురిని కనిపెట్టుకొని ఉంటున్న భార్యను ఇంటికి పంపిస్తున్నాడు. ఈ పది దినాలుగా ఇదే తంతు.