రోజులు మారిపోయాయి, వృద్ధాప్యంలో కన్నబిడ్డలు తమను చూడరని భావించి వారికి దూరంగా వెళ్ళిబతికితే ఇక బంధాలకూ అనుబంధాలకూ అర్థం ఉండదు. పెద్దతరంవాళ్ళు పెద్ద మనసు చేసుకోక తప్పదు. కాస్తంత త్యాగం చెయ్యకా తప్పదు. చిన్నచిన్న సర్దుబాట్లు చేసుకుంటూ, బిడ్డల్నే అంటిపెట్టుకుని ఉండాలి. ఆప్యాయతలు, అనుబంధాల అనుభూతులు ఎంతగొప్పవో ఈ తరానికి రుచి చూపించాలి. చెప్పాలి. తప్పదు. ఎందుకంటే....

 

సాయంత్రం ఆరవుతోంది.బజారు నుంచి రాగానే వంటింట్లో గిన్నెల చప్పుడు వినిపిస్తుంటే, మా ఆవిడ శివానీ కునుకుపూర్తిచేసి లేచి టీ పెడుతోందని అర్థమైంది.‘‘ఏవండోయ్‌ మన వేణు ఉత్తరం రాశాడు. టేబుల్‌మీద పెట్టాను చదువుతూ ఉండండి. ఈ లోగా టీ కలిపి తెస్తాను’’ వంటింట్లోంచి చెప్పింది శివాని.కూరగాయల బ్యాగ్‌ టేబుల్‌మీద పెడుతుంటే పెద్దాడు వేణు రాసిన ఉత్తరం కనపడింది. చదవకుండానే అందులో ఏముందో ఊహించగలను.నా ఇద్దరి కొడుకులకూ నేను సర్వీసులో ఉండగానే పెళ్ళిళ్ళు చేసేశాను. ఒకడు ఢిల్లీలో ఇంకొకరు కలకత్తాలో చక్కని ఉద్యోగాల్లో ఉన్నారు. రిటైరయ్యాక కూడా మేం ఇలా విడిగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు.

 

 ‘మా దగ్గరకు వచ్చెయ్యండి నాన్నా..’ అని వంతులు వేసుకునిమరీ వారానికొకళ్ళు చొప్పున రాస్తుంటారు.తల్లిప్రేమకొద్దీ నా అర్ధాంగి శివాని, నేను రిటైరయ్యాక కొడుకుల దగ్గరకి వెళ్ళిపోదామందిగానీ నేనే ఒప్పుకోలేదు. ఎందుకంటే తరాల అంతరం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఈ వయసులో కొడుకులచేత కోడళ్ళచేత మాటలుపడుతూ బ్రతకడం నాకిష్టం లేదునేను తీసుకున్న నిర్ణయం వెనుక నా ఆశ ఉంది. కోరిక ఉంది.నా దృష్టిలో పేదవాడు ఎప్పుడూ చాలా అదృష్టవంతుడు. ఆకలేస్తే బాహాటంగా చెప్పుకోగలడు. బాధకలిగితే భోరున ఏడ్చేయగల స్వాతంత్య్రం అతనికి ఆ తరగతి ప్రసాదించిన అదృష్టం.కాని ఒక మధ్యతరగతి కుటుంబంలో నలుగురి మధ్యలో పుట్టినవాడికి ఆ అదృష్టం ఉండదు.అందుకే ఎప్పుడైనా ఇంట్లో ఇబ్బందులతో నాన్న డబ్బు పంపించలేకపోతే,పట్నంలో అద్దెకుంటున్నప్పుడు ఆ ఇరుకుగదిలోనే దారిద్య్రపుబాధను గుండెల్లోనే కుక్కేసుకునేవాణ్ణి. పేగులు అరవడం ఆగేదాకా మునగదీసుకుని పడుకుని కాలేజీ టైమ్‌ అవగానే ముఖానికి చిరునవ్వు నుపులుముకుని ఆపూట తినకపోయినా ఓ కిళ్ళీ బిగించి కాలేజీలో స్నేహితులతో పకపకలాడుతూ గడిపిన నాకు జీవితం విలువ అందరికంటే బాగా తెలుసు.