ఒకానొక గ్రామంలో చపలుడనే పేదవాడు ఉండేవాడు. ఈతి బాధలు భరించలేక జీవితమంటే అతడికి విరక్తిపుట్టింది. ఆత్మహత్య చేసుకుందామని బయల్దేరాడు. అయితే ఎలా చావాలో తెలియలేదు. చివరకు వాడో కొండఎక్కి పైనుంచీ క్రిందకు దూకి ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. సగం కొండెక్కేసరికి వాడికి అలసట పుట్టి విశ్రాంతి కోసం ఒకచోట కూర్చున్నాడు. ఆ సమయంలో, ‘‘నీకు నిజంగా చావాలనుంటే ఈ పాతాళకూపంలోకి దూకు’’ అన్న మాటలు వినిపించాయి.

చపలుడు ఆశ్చర్యపడి చుట్టూ చూశాడు. పక్కగానున్న పెద్ద గోతిలోంచి వాడికి ఆ మాటలు వినవస్తున్నాయి. చపలుడు లేచివెళ్లి గోతిలోకి తొంగిచూశాడు. ఎంత లోతుందో కానీ చపలుడికి ఆ గొయ్యి అంతు కనబడలేదు. అయితే తానెలాగూ చావాలనుకుంటున్నాడు కాబట్టి ఆ పాతాళకూపంలోకే దూకి ప్రాణం తీసుకోవాలనిపించింది. చలలుడు కళ్ళు మూసుకుని అందులోకి దూకేశాడు.తను వేగంగా కిందకి పడతాననీ, ఏ రాయో తగిలి తల బద్దలుకావచ్చనీ అనుకున్నాడు కానీ అలా జరగలేదు. గాలిలో తేలుతూ నెమ్మదిగా క్రిందకు దిగుతున్నట్టు అనిపించింది చపలుడికి.

అలా కొంతదూరం వెళ్లేసరికి ఎవరో తనను పట్టుకుని ఆపినట్లయింది. ఎవరా అని తడిమి చూశాడు కానీ చేతికెవరూ తగల్లేలేదు. పోనీ భ్రమపడ్డానా అనుకుంటే ఆ గోతికి మధ్యలోనే గాలిలో ఆగిపోయి అలా నిలబడిపోయాడు చపలుడు. ఏం చేయాలో తెలియక, ‘‘నన్ను పట్టుకున్నదెవరో తెలియడం లేదు. దయతో నా మానాన నన్ను వదలిపెట్టండి, నా చావు నన్ను చావనివ్వండి’’ అని గట్టిగా అరిచాడు. ‘‘అసలు నువ్వెందుకు చావాలనుకుంటున్నావో చెప్పు. నిన్ను వదిలి పెడతాను’’ అన్న మాటలు వినిపించాయి చపలుడికి.