నిజానికి ఆమెకూ ఆ ఇంటికీ ఏమీ సంబంధం లేదు. ఆమె ఆ ఇంటి సభ్యురాలు కాదు, ఇంటి బంధువు కూడా కాదు. కేవలం జీతానికి ఆ ఇంట్లో పనిచేస్తోంది. అలాంటి సందర్భంలో అనుకోకుండా ఆ ఇంటి పెద్దాయనకు పెద్ద ప్రమాదం జరిగిపోయింది. కాలు విరిగింది. ఆ రాత్రివేళ ఆమె నిస్సయంగా ఉన్నా, అంబులెన్స్‌ పిలిచి ఆయన్ను హాస్పిటల్‌కు తరలించింది. కానీ ఇంత పెద్ద విషయాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా దాచిపెట్టింది! ఎందుకని?.....

**********************************

‘‘నాన్నా బస్సు టైమైంది’’బెడ్రూములోంచి అరిచాడు రాహుల్‌ పుస్తకాల బ్యాగ్‌ వెనక తగిలించుకుంటూ.వంటింట్లో గిన్నె కిందపడిన చప్పుడు...ఆ వెనకే, ‘‘బయలుదేరు, బయలుదేరు...’’ అంటూ హడావుడిగా చేతిలోంచి దొర్లిపోయిన గిన్నె వెంట పరుగెత్తి పట్టుకుని దాన్ని షింకులో పడేసి బయటకు వచ్చాడు రమణ.మనవణ్ణి తీసుకుని మెట్లు దిగుతున్న కొడుకువైపే చూస్తూ ఓ నిట్టూర్పు విడిచి చేతిలో మంచినీళ్ళ గ్లాసు బల్లమీద పెట్టారు అవధాని. రోజూ కొడుకు పడుతున్న అవస్థలు చూస్తుంటే ఆయన గుండె తరుక్కుపోతోంది. పట్టుమని పదేళ్ళు కాపురం సాగకుండానే కారు ప్రమాదంలో కన్ను మూసింది కోడలు సత్య. అనుకోని ఆ సంఘటన తన కొడుకు జీవితాన్ని తలకిందులు చేసింది. పూలనావలా హాయిగా సాగిపోతున్న జీవితంలో చీకట్లు ముసురుకున్నాయి.

ప్రైవేటు కంపెనీలో చక్కటి ఉద్యోగం, విశాఖ సముద్రతీర గాలుల్ని ఆస్వాదించే చోటనే చక్కగా అమిరిన ఇల్లు, ఉన్న చోటనే బాగానే సంపాదించుకుంటున్న ఒక్కగానొక్క కొడుకు కాపురం పిడుగుపాటులా కూలిపోవడం చూసి తట్టుకోలేకపోతున్నారు అవధాని. కోడలు ఇంకా నట్టింట తిరుగుతున్నట్టే అనిపిస్తోంది ఆయనకు. కొడుకు అలోచన ఏమిటో తెలుసు ఆయనకి. మనవడి జీవితం, తన జీవితం పొయ్యిలో పడ్డట్టవుతుందనే మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనే ఆలోచనే రానివ్వట్లేదు రమణ. వంట మనిషిని పెట్టుకుని రోజులు నెట్టుకొస్తున్నాడు. ఆమె కూడా ఈ మధ్యే మానేసింది. ఇటు ఇంట్లో పనుల చిరాకు, ఆఫీసులో బాధ్యతల ఒత్తిడులతో సతమతమవుతున్నాగానీ, ఎంతో ఓర్పూ, సహనం అలవర్చుకున్నాడు కొడుకు. లేని నవ్వు మొహంమీదకు తెచ్చుకుని, అన్నీ ఓర్చుకుంటూ, అలసట, ఆవేదన తెలియనివ్వకుండా పైకి చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటాడు.