‘‘వెంకటేశం!’’ గట్టిగా అరుపు వినిపించింది. కునుకుపాట్లు పడుతున్న వాడల్లా దిగ్గున లేచాడు.ఎదురుగా బాస్‌, బదరీనాధ్‌ గారు. కోపంతో ధుమధుమలాడుతున్న ముఖం.ఒక్కసారి చుట్టూచూసాడు వెంకటేశం. ఆఫీసులో అంతా తనవంకే చూస్తున్నారు. కొంతమంది నోటికి చేతులు అడ్డం పెట్టుకుని నవ్వు ఆపుకుంటున్నారు. సిగ్గుపడుతూ అలాగే నుంచున్నాడు. తమ బాస్‌ నోరు విప్పారు.

‘‘ఏంటండీ?! ఆఫీసులో నిద్రపోవడం. దాంతోపాటు ఆఫీసుకు లేటుగా రావడం. ఇక టైపుచేస్తే అన్నీ తప్పులే. ‘టిఇబిల్‌’ అంటే టేబుల్‌ అనీ కాఫీకి కాఫీ అనీ ఏంటండీ ఇంత సర్వీసు పెట్టుకుని’’ అంటూ ఆయన అరిచాడు.‘‘సారీ... సార్‌... ఏదో తలనొప్పిగా ఉండి నిద్దరొచ్చేసింది. ఇకనుంచీ జాగ్రత్తగా ఉంటాను’’ మెల్లగా చెప్పాడు. ‘‘ఎన్నిసార్లు? ఇప్పటికి మూడు మెమోలిచ్చాను. అయినా మీకు బుద్ధి రాలేదు. ఈసారి మళ్ళీ ఇలాంటి తప్పులతో టైప్‌ చేస్తే ఊరుకోను’’ అరుస్తూ ఆయన అక్కడ నుంచి కదిలాడు.వెంకటేశానికి చాలా అవమానంగా అనిపించింది. ‘‘తనని ఆయన కేబిన్‌లోకి పిలిచి చీవాట్లు వెయ్యవచ్చు కదా! పది మందిలో పిలిచి రభస చేసే బదులు!’ అనుకున్నాడు. నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు.

తన డ్రాయర్‌ సొరుగు లాగి తన పెర్సనల్‌ ఫైలు తీసాడు. ఆ ఫైలు చూడగానే దుఃఖం వచ్చింది వెంకటేశానికి. బాస్‌ ఈ ఆఫీసులో చేరిన ఆరు నెలల్లో మూడు మొమోలు ఇచ్చాడు. ఆయన డైరెక్ట్‌ రిక్రూట్‌ అధికారిగా తమ కంపెనీలో చేరాడట. దేశంలోని తమ బ్రాంచీలలో, డివిజనల్‌ కార్యాలయాలలో పనిచేసి పదేళ్ళకే ఈ జోనల్‌ స్థాయి ఆఫీసులో మేనేజరు స్థాయికి ఎదిగాడు. తను రికార్డు క్లర్కుగా ఉద్యోగం ప్రారంభించి ఈ ముప్పయ్యేళ్ళ సర్వీసు పూర్తిచేసి ఇప్పటికి సీనియర్‌ అసిస్టెంట్‌ అయ్యాడు. ఈ మధ్యకాలంలో కంప్యూటరీ కరణ, ఆన్‌లైన్‌ సర్వీసులు, ఇంటర్‌నెట్‌ ద్వారా వ్యాపార లావాదేవీలు వీటిలో తను వెనుక బడ్డాడు.

ఈ కాలపు కుర్ర ఉద్యోగులతో పోటీ పడలేకపోతున్నాడు. అందుకే బాస్‌ నుంచి దిన దిన గండం, చీవాట్లు ప్రాపిస్తున్నాయి.నిట్టూర్పు విడిచి మళ్ళీ ఫైల్లోకి తల దూర్చాడు. తన కంప్యూటర్‌లోకి లాగిన్‌ అయ్యి నానా తంటాలుపడి ఒక ఉత్త్తరం టైప్‌ చేయడం మొదలెట్టాడు. అరగంటకు ఉత్తరం టైప్‌ చేయడం పూర్తిచేసాడు. ఈలోగా ఆఫీసులో గోడ గడియారం ఆరు గంటలు కొట్టింది. ‘బ్రతుకు జీవుడా అనుకుంటూ’ ఆఫీసులోంచి బైటపడి ఇంటిదారి పట్టాడు.