కాలం ఎంతో వేగంగా కరిగిపోతుంది. బాల్యం, యవ్వనం గుర్తుచేసుకునే ప్రతివ్యక్తికీ ఇది అనుభవైకవేద్యమే. ఎందుకో ఆ దశల్లో ఉండే మౌలికమైన అనుభూతులు ఏ తరంలో అయినా మళ్ళీ మళ్ళీ రిపీట్‌ అవుతూ ఉంటాయి. అది వయసు ముచ్చటే! ఈ కథలో కూడా రవి ఆ అనుభూతుల్ని చవిచూశాడు. అతని తండ్రి కూడా అవే అనుభూతుల్ని దాటుకుని వచ్చాడు. ఇప్పుడు అతడి కూతురికి కూడా అవే అనుభూతులు ఎదురవుతున్నాయి. కానీ.....*********************************అర్థరాత్రి..గాఢనిద్ర..ఎవరో తలుపుతట్టిన శబ్దం. బద్ధకంగా కళ్ళు తెరచి పక్కకి చూశాను. భార్య సౌజన్య కూడా గాఢనిద్రలో ఉంది. విసుగ్గా లేచివెళ్ళి తలుపు తీశాను. ఎవరూ కనిపించలేదు. చిరాగ్గా వెనక్కి తిరగబోతుంటే,పరిచయమున్న ఓ గొంతు ‘‘శశిధర్‌’’ అని పిల్చినట్టన్పించింది. వేగంగా వెనక్కి తిరిగాను. పండువెన్నెలలో నిలబడిన ఆ రూపాన్ని వెంటనే పోల్చుకోగల్గాను.‘ఎన్నోఏళ్ళక్రితం చూసిన ఆమె..! ఇప్పుడు...ఇక్కడ..! ఈ అర్థరాత్రివేళ..!’ ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటే, ఆలోపే నా దగ్గరకి వచ్చేసింది. అప్రయత్నంగానే, ‘‘జెస్సీ! నువ్వా?!’’ అనేశాయి నా పెదవులు.‘‘ఎస్‌... ఐయాం’’ అంది మెల్లగా.షాక్‌ కొట్టినట్టు ఆమె మొహంలోకిచూస్తూ, ‘‘ను....వ్వు... ను....వ్వు... ఇ...క్కడి..కె...లా?’’ ఆశ్చర్యంనుండి తేరుకోకముందే జెస్సీ నా దగ్గరొకొచ్చి, తెరచిన నా నోటిని అరచేత్తో మూసేసి, ‘‘ఐ లవ్యూ రవీ!’’ అంది చెవి దగ్గర పెదవులను తాకిస్తూ. అంతే! ఆ మాటకి నా చెవుల్లో వంద వయొలిన్లు ఒక్కసారి మ్రోగినట్టు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ శబ్దం హోరెత్తింది. ఎన్నో ఏళ్ళ ఎదురుచూపులకు జన్మసాఫల్యం పొందిన తాదాత్మ్యత. ఆ ఉద్వేగంలో నా గుండెల్లో ఉప్పొంగిన తడి కళ్ళలోకి చేరింది.‘‘ఎందుకు? వచ్చేశాగా?’’ అని నా కళ్ళను ముద్దాడి నన్ను గాఢంగా తన హృదయానికి హత్తుకుంది. ఆ పరిష్వంగంలో ఎన్నో ఏళ్ళ తర్వాత సేదతీరుతున్న నిరీక్షణ మంచులా కురగిపోతోంది.‘‘మరి... సౌజన్య’’ అన్నాను కాస్సేపటికి.‘‘‍సౌజన్యా నేనే...నీ జెస్సీ! నేనే’’ అని ఎప్పుడో క్లాసులో పాడిన టైటానిక్‌ థీం సాంగ్‌ నా చెవి దగ్గర పాడుతోంది.' ఏవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్, ఐ సీ యూ, ఐ ఫీల్ యూతో మొదలుపెట్టి, లవ్ కెన్ టచ్ అజ్ వన్ టైమ్ అండ్ లాస్ట్ ఫర్ ఎ లైఫ్ 'తో ముగుస్తుంటే, నేనూ ఆమెతో గొంతు కలిపి పాడుతున్న నన్ను తట్టిలేపింది సౌజన్య.