సుబ్బారావు చాలా పెద్ద కాంట్రాక్టరే. అవినీతికి పాల్పడుతూ బాగా సంపాదిస్తున్నాడు. తన పిల్లల్ని సినిమా యాక్టర్లూ, రాజకీయనాయకుల పిల్లలు చదువుకునే చాలా పెద్దస్కూల్లో చేర్చాడు. తను స్వయంగా కాంట్రాక్టరు గనుక చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. పిల్లలకు ప్రత్యేకంగా ఒక స్టడీ రూమ్‌ కూడా ఏర్పాటు చేశాడు. ఇన్ని సదుపాయాలు సమకూర్చినాగానీ అతని పిల్లలకు అత్తెసరు మార్కులే వస్తున్నాయి. అప్పుడు ఆ కాంట్రాక్టర్‌ ఏం చేశాడంటే.....

**************************

 

‘‘ఏంటోయ్‌ డల్‌గా ఉన్నావ్‌?’’ అడిగాడు రామారావ్‌.‘‘ఏం చెప్పమంటావ్‌ గురూ, మా పిల్లల్ని మంచి కార్పొరేట్‌ స్కూల్లో జాయిన్‌ చేసినాగానీ వాళ్ళ చదువు అంతంత మాత్రంగానే ఉంది’’ చెప్పాడు సుబ్బారావ్‌.‘‘ఏ స్కూల్‌?’’సుబ్బారావు ఆ స్కూలుపేరు చెప్పగానే ‘‘బాబోయ్‌, అందులో చేర్చావా? ఫీజులు లక్షల్లో గుంజుతారు కదా’’ ఆశ్చర్యంగా అన్నాడు రామారావ్‌.‘‘డబ్బుకేముందిలే, మనం కాంట్రాక్టులద్వారా బాగానే సంపాదిస్తున్నాంకదా. నాసిరకం పనులు చేసినా అడిగేవాడు లేడు. అడగడానికి వచ్చిన అధికారులను డబ్బుతో కొట్టి మాట్లాడకుండా చేస్తున్నాం’’ అన్నాడు సుబ్బారావ్‌.‘‘నువ్వు చెప్పేది నిజమేననుకో. మరి మీ పిల్లలు అంతపెద్ద స్కూల్లో చదువుతున్నందుకు మార్కులు బాగానే రావాలే’’.‘‘రావడంలేదనే కదా నా బాధ. స్కూలువాళ్ళేమో మా బోధన అద్భుతం అంటారు. ప్రోగ్రెస్‌ రిపోర్టుచూస్తే మా వాళ్ళకు అత్తెసరు మార్కులే వస్తున్నాయి. పిల్లలు బాగానే చదువుతున్నా మార్కులు ఎందుకు రావడంలేదో అర్థం కావడంలేదని మా ఆవిడ తెగబాధపడిపోతోంది’’ వాపోయాడు సుబ్బారావ్‌.అతని బాధ చూసిన రామారావ్‌ ‘‘సరే ఓ పని చెయ్‌, నాకు తెలిసిన ఒక సిద్ధాంతి ఉన్నాడు. ఆయన్ను ఒకసారి సంప్రదిస్తే నీ సమస్యకు పరిష్కారం దొరకొచ్చు’’ అన్నాడు.‘‘పిల్లల చదువుకోసం మంచి ట్యూషన్‌ మాస్టర్‌ని సంప్రదిస్తే బాగుంటుంది కాని సిద్ధాంతి ఏం చెబుతాడోయ్’’ ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావ్‌.

‘‘వెళ్ళి కలిస్తే నీకే తెలుస్తుంది పద’’ అని తీసుకెళ్ళాడు రామారావ్‌.సిద్ధాంతి ఇంటిగేటుకు వాస్తురత్న పరబ్రహ్మశాస్త్రి అని రాసినబోర్డు కనిపించింది. లోపల ఆయన యమ బిజీగా ఉన్నాడు.ఏదో ఆసుపత్రికి సంబంధించిన వాస్తు సలహాలు సూచిస్తున్నాడాయన.‘‘ఆసుపత్రి భవనం తూర్పుముఖంగా కడితే దానిఖ్యాతి దశదిశలా వ్యాపిస్తుంది. కన్సల్టింగ్‌ రూమ్‌ ఈ భవనానికి నైరుతిదిశలోగానీ, దక్షిణంవైపుగానీ ఏర్పాటుచేయండి. ఆసుపత్రి ఆదాయానికి గుండెకాయలాంటి ఐసీయూ వార్డును వాయువ్యంలో వాస్తుప్రకారం ఉంచాలి. దీంట్లోచేరిన రోగులు త్వరితగతిన కోలుకుని ఇళ్ళకు వెళుతుంటే ఆసుపత్రికిపేరు, డబ్బు వస్తాయి. ఇక్కడ వేసే పేషంట్ల బెడ్‌లు వాస్తుప్రకారం ఉండాలి. లేదంటే వారికి మృత్యుదేవత ఆహ్వానం పలుకుతుంది. అందుకే ప్రతి పేషంట్‌ తల దక్షిణదిశవైపు వచ్చేవిధంగా బెడ్‌లు ఏర్పాటుచేయాలి. అంటే బెడ్‌మీద పడుకున్నరోగి ముఖం ఉత్తరదిశ చూస్తుండాలి. ఇలా ఉంటే రోగికి చేసే వైద్యం చక్కటి ఫలితాలనిస్తుంది.