అతడిని ఎవ్వరూ పట్టించుకోరు. అతడిగురించి ఆలోచించేవాళ్ళే లేరు. నిజం చెప్పాలంటే, లక్షలూ, కోట్లూ సంపాదించినవాడే. చివరకు కూలీగా మారిపోయాడు. అనాథగా మిగిలాడు. కానీ ఊరు ఊరంతా ఆశ్చర్యపోయేలా ఎవ్వరూ చేయలేని పని ఒక్కటి చేశాడతను. అందుకే అతడు జీవన్మృతుడు! ఇంతకీ ఏం చేశాడతను? ఎందుకు అలా జీవచ్ఛవంలా బతుకుతున్నాడు?

కింగ్‌జార్జి ఆసుపత్రి లోపలికి ప్రవేశించాడు చింతామణి. పెద్దపెద్ద గేట్లు. రాతి భవనాలు. అక్కడక్కడ రావి,మర్రి చెట్లు. చెట్లమీద కాకులు. ఆసుపత్రిలోపలి రోడ్డుమీద హడావుడిగా మనుషులు, డాక్టర్లు, నర్సులు, పేషెంట్లు, అంబులెన్సులు, చక్రాల కుర్చీలు. మరోపక్క ఆటోలు, కార్లు, స్కూటర్లు.గాలి వీస్తోంది. ఫినాయిల్‌కంపు. డెట్టాల్‌ వాసన. వార్డులచిక్కాల్లోంచి రోగులు కనిపిస్తున్నారు. అందులో అతడికి ఎవరూ బంధువులు కారు. స్నేహితులు కారు. ఎందుకో ఆసుపత్రిని తన బాహువుల్లో బంధించి అతడిని ముద్దాడాలని అనిపించింది. చింతామణికి అంతకుముందు ఆ ఆలోచన కలగలేదు. అప్పటికప్పుడు ఆ వాతావరణ స్ఫూర్తితో వచ్చింది. ఒక ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చాడు.ఆసుపత్రి అంటే చింతామణికి పడదు. తన జీవితంలో పెద్దాసుపత్రికి వచ్చింది రెండుసార్లే. మొదటిపెళ్ళాం చచ్చిపోయినప్పుడు. ఇదిగో ఇప్పుడు రెండోసారి ఈ ప్రత్యేక సందర్భంలో వచ్చాడు. ఆసుపత్రిమీద అప్పుడున్న కోపం ఇప్పుడుపోయింది. ఒక విచిత్రమైన ప్రేమ పుట్టుకొచ్చింది.

చింతామణి నడుస్తూ నడుస్తూ మార్చురీవైపు వెళ్లాడు. గుండె ఝల్లుమంది. అతడి భార్యను ఇక్కడే కోసేశారు. మళ్లీ కుట్టేశారు. పాలివ్వడానికి గేదెముందు గడ్డితో చేసిన పెయ్య బొమ్మని పెడతారు. తన భార్యని అలాంటి గడ్డిబొమ్మలా చేసి తన చేతికిచ్చారు.అప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్న భార్యను ఆసుపత్రికి తీసుకొచ్చాడు. తిరిగి గడ్డిబొమ్మను తీసుకువెళ్ళాడు. భార్యను పట్టుకుని ఏడ్చాడు. కొంతసేపైన తరువాత కన్నీళ్ళు ఇంకిపోయాయి. ఏడవాలనుంది. కానీ తడిలేదు. ఏం చేస్తాడు? సొంతఊరు సీతారాంపురం తీసుకెళ్ళి పిడికెడు బుగ్గి చేసేశాడు. జరిగిదంతా మార్చురీ దగ్గర ఒక సినిమారీలు తిరిగినట్లు మనసు తెరమీద కదిలింది. అతడి కళ్ళు అప్రయత్నంగా కన్నీరు కార్చాయి.

కన్నీళ్ళు తుడుచుకుని ముందుకు నడిచాడు.‘ఆంధ్ర వైద్య కళాశాల’ అనే బోర్డు కనిపించింది. ‘హమ్మయ్య! అసలుపని వదిలిపెట్టి అక్కడాఇక్కడా తిరిగాను. ముందీపని చేసుకోవాలి’ అని మనసులోనే అనుకుని మొబైల్‌ ఫోన్‌ తీసి ఫోన్‌ కాల్‌ చేశాడు. అవతలివైపునుంచి ‘హలో’ అని వినిపించింది. ‘‘సార్‌. నేను చింతామణిని. శ్రీరాములు చెప్పాడు కదా’’ అన్నాడు. ‘‘ఆఁ గుర్తుంది. వచ్చేశారా? ఎక్కడున్నారు?’’ అడిగాడు సూపర్నెంట్‌ ఆఫీసు గుమస్తా. ‘‘మీ బోర్డు కనబడుతోంది. బయటే ఉన్నాను’’ చెప్పాడు చింతామణి. ‘‘లోపలికి వచ్చెయ్యండి. నేనిక్కడే ఉన్నాను. సూపర్నెంట్‌ గారికి చెప్పాను’’ అన్నాడు గుమస్తా.