బాగా పండిన నారింజరంగు సాయంసంధ్యా సూర్యునితోపాటు మేము కూడా ఆ రోజుకి కాలేజీ అయిందనిపించి ఇళ్ళకి బయలుదేరాం. అయిదారుగురితో బృందంగా బయలుదేరిన మేము కాలేజీలో ఆనాడు జరిగిన విషయాలపై చెణుకులు విసురుకుంటూ నడుస్తున్నాం. ఎవరి ఇళ్ళున్న వీధులకి వారు, స్పేస్‌క్రాఫ్ట్‌ విదిలిన ఉపగ్రహాల్లా వీడిపోతుంటే, నేనూ వాసూ ఇంకా సాగిపోతూనే ఉన్నాం. అప్పుడో సైకిలూ, అప్పుడొక రిక్షా ఎదురొస్తున్నాయి. వాసు ఇల్లూ, నా రూమూ పక్కపక్కనే ఉన్నా, ఊరికి కొంచెం దూరంగా ఉన్నాయి.

‘‘మెరుపు మెరిసింది! రోడ్డు తళుక్కుమంది’’ అన్నాడు వాసు.‘‘తొందరగా పద, వర్షం పడకముందే ఇంటికి చేరుకుందాం’’ అన్నాను.‘‘జోకులెయ్యకు, ఛీ ఛీ.. మెరుపంటే నిజం మెరుపులు కాదురా. మెరుపుతీగ, చూడు.. అక్కడ’’. అటుచూశాను. దూరంగా ఉందా అమ్మాయి. మాకెదురుగా వస్తోంది. వయ్యారంగా నడుస్తూ.. అందంగానే ఉన్నట్లు కనపడుతోంది.‘‘చూడు, హంసలా నడుస్తోంది’’‘‘నేను హంస నడక ఎక్కడా చూడలేదు ఎన్‌.జీ.సీ ఏనిమల్‌ ప్లానెట్‌ల్లో కూడా’’ అన్నాను.‘‘కుళ్ళు జోకులెయ్యకు’’ నవ్వుతూ నాకేసి చూశాడు. కన్ను గీటి ఆవైపు చూపించాడు.అంతలోనే ఆ మెరుపుతీగ దగ్గరగా వచ్చింది. నిజంగానే అందంగా ఉంది. అసలు అందం కంటే, తెచ్చిపెట్టుకున్న అందం ఎక్కువగా కనపడింది. బాగా దగ్గరికి వచ్చేసిందామె.

తల వంచుకుని నేనామెకేసి చూడాలనే ప్రయత్నం చేశా. కళ్లు సహకరించలేదు. నేను చేస్తున్న వ్యర్థప్రయత్నం ఆమె కనిపెట్టినట్లుందనిపించి తెలిసి కళ్ళు దించుకున్నా. మళ్లీ ఆ అమ్మాయి దాటిపోతుందని కళ్లెత్తి చూశా. సరిగా అప్పుడే ఆమె కూడా నాకేసి చూసింది. ఆమె కళ్లతో నా కళ్లు ఒకే సరళరేఖలోకి లిప్తపాటు వచ్చాయి. ఆ(అ)భాగ్యక్షణంలో నా వంట్లోని రక్తం విపరీతమైన వేగంతో ప్రవహించింది. శరీరం తెలియని ఉద్వేగానికి లోనయ్యింది. ఆ సంకేతాలు మెదడుకి కూడా చేరడం వల్ల అక్కడినించి వచ్చిన ఆజ్ఞలకనుగుణంగా నోరెండుకుపోయింది. ఇష్టమయిన దానిని చూస్తే నోరు తడి అవుతుంది. అయిష్టమయిన, భయంకరమైన దానిని చూస్తే నోరెండుతుంది. కానీ ఇక్కడ, నేను చూడడానికి ఇష్టమైనదానిని.. చూసేసరికి నోరెండుకు పోతోంది. విలక్షణ లక్షణం!