‘‘ఓ రెండు వందలుంటే ఇస్తారా...రెండు మూడు రోజులలో ఇచ్చేస్తాను’’గుమ్మం దగ్గరే నిలబడి అడిగాడు గోపాలం.గోపాలం మా వీధిలోనే ఉంటాడు. ఏం పనిచేస్తాడో తెలియదుగానీ భార్య, తల్లి ఇద్దరు ఆడపిల్లలు. బ్రతికి చెడిన కుటుంబం అని తనే ఒకసారి అన్నట్లు గుర్తు. అతడితో స్నేహం లేదు, కానీ పరిచయం ఉంది.‘‘అలాగే ముందు లోనికి రండి’’ అని లోనికి పిలిచి అడిగిన రెండువందలతోపాటు ఓ కప్పుకాఫీ కూడా ఇచ్చి పంపించాను.

ఆరు నెలల తరువాత..‘‘గురువుగారూ! ఓ ఐదు వందలుంటే ఇస్తారా..వారంరోజుల్లో ఇచ్చేస్తా’’ మళ్ళీ అదే గోపాలం... అదే గుమ్మమూ...అదే అభ్యర్థనా...ఇచ్చి పంపించేశాను. ఈసారీ కాఫీ ఇవ్వలేదు. నేను ఎప్పుడు ఇతడికి గురువునయ్యానో తెలియదు. అతడు ఐదొందలు అడుగుతున్నప్పుడు నాకు గుర్తుకువచ్చింది, గతంలో రెండువందలు ఇచ్చినట్టు, అతడు తిరిగి ఇవ్వనట్లు. అతడికి మాత్రం గుర్తున్నట్లు లేదు పుచ్చుకొన్నట్టు! మరో ఆరు నెలల తరువాత, గోపాలాన్ని స్కూటర్‌ గుద్దేసిందని తెలిసి చూడటానికి వెళ్ళాను. ఫ్రాక్చర్‌ గట్రాలేవు కముకు దెబ్బలు బాగా తగిలాయి. పది రోజులు విశ్రాంతి తీసుకోమన్నారట.

ఏవో పళ్ళుపట్టుకొని వెళ్ళి గోపాలం భార్య చేతిలో ఓ మూడొందలు పెట్టి వచ్చాను.‘‘మీరు అంతకుముందు ఇచ్చినవి తిరిగిచ్చినట్టు లేదు కదా? మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు?’’ అన్నది శ్రీమతి.‘‘పోనీలే పాపం! ఏదో కష్టాల్లో ఉన్నారు. వేలల్లో అంటే చెప్పలేంగానీ ఐదారువందలు సహాయం చేసే స్థితిలో ఉన్నాం కదా మపం’’ అన్నాను.అయితే తరువాత అతడిని పరిశీలించసాగాను.‘ఇద్దరు ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఎవరో కాంట్రాక్టర్‌ దగ్గర పనిచేస్తాడట. చాలీచాలని ఆదాయం. కష్టాలు షరామామూలే. ఆడపిల్లలు, చదువులు, ఆపై పెళ్ళిళ్ళు ఎలాగో...!’ నాకే భయం వేసింది.