ఆత్మాభిమానంతోనే పెరిగాడు ఆ నిరుపేద. ఎవరికీ తలొగ్గననీ, ఎవరి పాదాలూ ఒత్తననీ, తనకు ఉద్యోగం కావాలని ఆ ఊళ్ళోకెల్లా తెలివైనవాడి దగ్గరకెళ్ళి అడిగాడతను. దాంతో తెలివైనవాడు, నీచేత అందరికాళ్ళూ ఒత్తిస్తానని సవాలు చేసి, అతడిని గొప్పగొప్ప వ్యక్తులవద్దకు తీసుకువెళ్ళాడు. వారెన్ని ప్రలోభాలుపెట్టినా వారి పాదాలు ఒత్తడానికి ఇష్టపడలేదతను. ఆ తెలివైనవాడు తన కూతుర్ని ఇచ్చి పెళ్ళిచేస్తానన్నా అతడు లొంగలేదు. ఎందుకని? ఇంతకీ అతడు మూర్ఖుడా? మేధావా?…

 

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, నువ్విక్కడికి పరోపకారం చెయ్యాలని వచ్చావో, ప్రతిఫలం ఆశించి వచ్చావో నాకు తెలియదు. కానీ ఎవరికోసం నువ్వు ఇక్కడికి వచ్చావో వారే నీ అత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని గ్రహించాలి. ఒకప్పుడు నాగరాజు విషయంలో అలాగే జరిగింది.

 

శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెబుతాను. విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.సిరిపురంలో ఉండే నాగరాజుకు తండ్రి లేడు. తల్లి చిన్నప్పటినుంచీ వాడికి ఆత్మాభిమానాన్ని నూరిపోసింది. ఎంతలా అంటే వాడు కన్నతల్లికి కూడా పాదసేవ చెయ్యడు. చదువు పూర్తిచేసి పనిచేసే వయసు వచ్చేసరికి - ఎవరినీ ఆశ్రయించడం చేతకాక వాడికి ఎక్కడా పని దొరకడం లేదు. తల్లి వాడితో, ‘‘మన ఊరి భూషణం చాలా తెలివైనవాడు. ఆయన ఎవరిచేతనైనా ఎలాంటిపనైనా చేయించగలడు. నువ్వు ఆయన్ని కలుసుకో. ఎక్కడైనా ఉద్యోగం ఉంటే ఇప్పించమని అడుగు’’ అని చెప్పింది.నాగరాజు భూషణాన్ని కలుసుకుని, ‘‘నేను ఎవరినీ ఆశ్రయించను. ఎవరికాళ్లూ పట్టుకోను. నా ప్రతిభను నేనే నిరూపించుకోగలను. అది చూసి పని ఇచ్చేవారు ఎవరైనా ఉంటే, తమ తెలివి, చాతుర్యం ఉపయోగించి నాకు పని ఇప్పించండి’’ అన్నాడు.వాడు తన తెలివినీ, చాతుర్యాన్నీ సవాలు చేస్తున్నట్లు తోచింది భూషణానికి. అందుకని, ‘‘పని దొరకడం కష్టమేం కాదు. ఎటొచ్చీ అందుకు ఎవరినైనా ఆశ్రయించాలి. లేదా ఎవరి కాళ్ళైనా పట్టుకోవాలి. అలా చేయడం నీకు రాదంటున్నావు కాబట్టి - ముందు నిన్ను ఎవరికాళ్లైనా పట్టుకునేలాచేసి నా తెలివి, చాతుర్యం నిరూపించుకుంటాను’’ అన్నాడాయన.