గలగల పారే సెలయేటి నీళ్ళను వేళ్ళ కొసల్తో అందుకుని ముఖంపైన చిలకరించుకుంటున్నది ఇరవైయేళ్ళ పడుచుపిల్ల మొగిలి. నీళ్ళల్లోకి మోకాళ్ళదాకా మునిగిన కాళ్ళకింది సన్నని ఇసుక జారిపోతూ అరికాళ్ళను గిలిగింతపెడుతూ ఉంటే మొగిలి వళ్ళంతా పులకిస్తున్నది. నీళ్ళ లోంచి అప్పుడోటి, ఇప్పుడోటి చేపలు ఎగురుతూ తన కళ్ళను అందుకుందామని ప్రయత్ని స్తుంటే మొగిలి సుతారంగా అదిలిస్తున్నది. అవి నీళ్ళల్లోకి జారిపోతుంటే మనోహరంగా నవ్వుతున్నది. మొగిలిది చామనచాయపు ఆకర్షణీయమైన స్వరూపం.

మొగిలి తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. అల్లారుముద్దుగ పెరిగింది. కనుకనే గారాబం ఎక్కువై చదువుకొమ్మని తల్లి ఎంత పోరుపెట్టినా మొగిలి ఆటపాటల మీద తప్ప దేనిమీదా దృష్టి పెట్టలేదు.బతుకమ్మ పండుగలో మొగిలి పాట చెప్పకుండా ఏ జట్టూ బతకమ్మ ఆడేది కాదు. ఏ యింటి ముందైనా సంక్రాంతి ముగ్గు మొగిలి వేస్తేనే అందం. హోళీలో మొగిలి నాయకురాలైన పల్లెనంతా రంగుల్లో ముంచెత్తేది. పదేళ్ళప్పుడే తారసపడ్డాడు అనంతు మొగిలికి. ఇద్దరి కళ్ళు కలిశాయి. మనసులు కమ్మని ఊసులు మాట్లాడుకున్నాయి. అంతమాత్రం చేతనే పెదయ్యాక వాళ్ళు తీర్మానాలేవి చేసుకోలేదు.అనంతు మాటల్లోని నిజాయితీ, రజకవృత్తిలో దీక్ష, పట్టుదల స్వచ్ఛత మొదలైన వాటినన్నిటిని రూఢిగా తెలుసుకున్నది మొగిలి.మొగిలిలోని ఔదార్యం, ధైర్యం, పరోపకారగుణం, మానవతా దృక్పథం, హృదయ సంస్కారం అన్నీ రుజువులతో సహా అనంతు హృదయానికి బలంగా తగిలాయి.

పక్కనే ఎవరో గుట్టుచప్పుడు కాకుండా వచ్చి కూర్చున్నట్లనిపించింది మొగిలికి. నవ్వుకుంది.‘‘ఇంకెవడు? వాడే.... దొంగలాగా వచ్చేది వాడే... అనంతు’’ అనుకుని సన్నగా మళ్ళీ నవ్వు కుంది.ఎడమతొడ మీద చెయ్యి పడింది. ఒళ్ళు జల్లుమంది మొగిలికి. ఆ స్పర్శలో త్రాచుపాము బుసలు వినిపించగా చప్పున తల తిప్పి చూసి ఉలిక్కిపడింది మొగిలి.చిలిపిగా నవ్వుతున్నాడు సీతయ్య. సీతయ్య ఆ ఊరి సర్పంచ్‌. మొగిలి తండ్రి సైదులు అతని పొలాన్ని కౌలుకు చేస్తున్నాడు.మొగిలి చటుక్కున లేచి మౌనంగా ఊరుకేసి నడవసాగింది.సీతయ్య మొగిలి వెంటబడ్డాడు.‘‘పిల్లా! నిన్నే... ఏం, నాతో మాట్లాడవా?’’ అన్నాడు సీతయ్య వంకరగా చూస్తూ.మొగిలి ఆగి, గిరుక్కున వెనక్కుతిరిగి ‘‘ఏం నన్ను చేసుకుంటావా? ఉంచుకుంటావా?’’ అంది చురుగ్గా.