వాళ్ళిద్దరూ డాక్టర్లే. అతడి పెదవులపై ఎప్పుడూ చిరునవ్వే. అది చెరగని చిరునవ్వు. రోగులకు నిత్యం ఆహ్లాదాన్ని కలిగించే చిరునవ్వు. ఆ చిరునవ్వే తన రోగులకు సగం రోగాన్ని తగ్గించేస్తుందంటాడు భార్యతో అతను. కానీ ఆమె సీరియస్‌ మనిషి. ఈ మధ్య మరీ సీరియస్‌గా ఉంటోంది. ఎందుకంటే, అప్పుడప్పుడు అతడి రూమ్‌లోకి వెళుతూ ఉంటుంది ఆమె. ఒకసారి ఒక దృశ్యం ఆమెకళ్ళబడింది! ఆమెకు అస్సలు నచ్చని దృశ్యం! ఏమిటది?...

‘‘శ్రీ ఇంకా ఎంతసేపూ?’’ గట్టిగా అరిచింది డాక్టర్‌ సుమలత గోళ్ళకున్న నెయిల్ పాలిష్‌ చూసుకుంటూ.‘‘ఇదిగో వచ్చేస్తున్నా...’’ అన్నాడు డాక్టర్‌ శ్రీధర్‌.‘‘ఇప్పటికి అరడజనుసార్లు అన్నావు, ‘ఇదిగో వస్తున్నా’ అని. పావుగంట దాటింది నేను రెడీ అయి. కాంతమ్మచేసిన టిఫిన్‌కూడా చల్లారిపోయేలా ఉంది’’ అంది పొట్ట తడుముకుంటూ.‘ఏమిటో! ఆడవాళ్ళ కంటే అన్యాయం! ఓ పట్టాన అద్దం వదిలిరాడీయన’ గొణుక్కుంది సుమలత.మరో ఐదు నిముషాలకు గదిలోనుంచి బయటకువచ్చాడు శ్రీధర్‌. ‘రోజూ టైమేకదా? నేనేదో లేట్‌ చేశాను అంటావేం? పద వెళ్దాం’ అన్నాడు ఫోన్‌ చూసుకుంటూ.

‘‘అదేంటి. నువ్వు డైటింగా?’’ అంటూ హాట్‌పాక్‌లోనుంచి ఇడ్లీలు రెండుతీసి తన ప్లేట్‌లో వేసుకుని, నెయ్యి, కారప్పొడి వేసుకుంది సుమలత.‘‘నేను సలాడ్‌ తింటాలే’’ అంటూ ఆమె పక్కనే కూర్చుని రెండు కీరా ముక్కలు ఒక కారట్‌ ముక్క తన ప్లేట్‌లో వేసుకున్నాడు.‘‘వైద్యవృత్తిలో ఉంటూ, ఇలా మాల్‌ నరిష్‌ అయితే నీ పేషెంట్స్‌కి వైద్యం ఎలా చేస్తావు?’’ అంది సుమలత, ఒక ఇడ్లీ అతని ప్లేట్‌లోవేస్తూ.‘‘పేషెంట్లకు మందులకంటే డాక్టర్‌ మాటలే ఎక్కువ పనిచేస్తాయి. ‘ద అమెరికన్‌ సైకాలజిస్ట్‌’ మాగజైన్‌లో ఆ విషయమే రాశారులే! అందుకే నేను తియ్యటి కబుర్లు చెబితేచాలు వాళ్ళకి బాగైపోతుంది’’ అన్నాడు శ్రీధర్‌.‘‘పోనీలే, మందులఖర్చు మిగులుతుంది’’ వెటకారంగా అంది! ఆమె కోపంచూసి నవ్వుకున్నాడు శ్రీధర్‌. ‘‘హేయ్‌, ఒక్కనిమిషం ఆగు’’ అన్నాడు అప్పుడే టేబుల్‌ దగ్గరనుంచి లేచి వడివడిగా వెళ్ళబోతున్న సుమలతను చూస్తూ.‘‘ఏమైంది?’’ అంది సుమలత ఆగి అతనివైపు చూస్తూ.‘‘ఒక్కసారి నవ్వు, అలా కోపంగావెళ్తే మన పేషంట్లు ఏమైపోతారు’’ అంటూ ఆమె దగ్గరకువెళ్ళి నడుముచుట్టూ చెయ్యివేసి తన దగ్గరకు లాక్కుని బుగ్గమీద ముద్దుపెట్టుకున్నాడు.