పొద్దుటినుండి అందరూ ఆపరేషన్‌ థియేటర్‌వైపే చూస్తూకూర్చున్నారు.కొడుకుని చూస్తున్నకొద్దీ కడుపు తరుక్కుపోతోంది రాధకి. కాని దగ్గరకెళ్ళడానికి భయం వేస్తున్నది. వంగి తల చేతుల్లోపెట్టుకుని కూర్చున్న తమ్ముడి భుజాలచుట్టూ ధైర్యం చెబుతున్నట్లుగా చేతులేసి నిలబడింది వేద. అటూఇటూ పచార్లుచేస్తూ, మధ్యమధ్య కొడుకు దగ్గరకొచ్చి ‘ఏమీ ఫర్వాలేదు’ అన్నట్లు భుజం తడుతున్నారు మురళీధరం. నెమ్మదిగా ఆపరేషన్‌ థియేటర్‌ తలుపులు తెరచుకున్నాయి. 

అటే చూస్తూ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి అలర్టయ్యారు డాక్టర్‌ ఏం చెప్తారో అన్నట్టు. డాక్టర్‌ వీళ్ళ దగ్గరకొస్తుండగా వేరే పేషంట్‌ తాలూకూవాళ్ళు వెళ్ళి ఆయన్ను ఏదో అడుగుతుంటే అక్కడే ఆగి మాట్లాడుతున్నారు ఆయన. ఆ ఆలస్యం భరించలేక అక్కచేతిని గట్టిగాపట్టుకున్నాడు విశ్వ. చేతులు చల్లబడిపోయాయి.. స్వేదంతో చొక్కా తడిసిపోయింది. ఇంక ఆగలేక పరుగున డాక్టర్‌ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. విశ్వని చూడగానే మాటలు ఆపేసి ఆమె చిరునవ్వుతో విశ్వవైపు చూసింది.

ఎంతో దయగా నవ్వుతున్న ఆమె ప్రశాంత వదనం గమనించగానే ఒకరకమైన రిలీఫ్‌తో నీరసం వచ్చి పక్కనున్న కుర్చీలో జారగిలపడిపోయాడు విశ్వ.‘‘బీ బ్రేవ్‌ మైబాయ్‌. మీ ఆవిడ క్షేమంగా ఉంది. నో టెన్షన్‌. రిలాక్స్‌. వేదా వీడితో కాస్త కాఫీ అయినా తాగించు. ధృతిని రేపొద్దున్నవరకు ఐ.సి.యులోనే ఉంచుతాం. విశ్వా నువ్వు ఏమన్నా తీసుకుంటేనే నిన్ను లోపలికి పంపించేది’’ నవ్వుతూ బెదిరించింది డాక్టర్‌ ప్రశాంతి.‘‘థాంక్యూ! ఆంటీ... థాంక్యూ వెరీమచ్‌’’ ఆనందంతో డాక్టర్‌ రెండుచేతులనూ కళ్ళకు అద్దుకున్నాడు విశ్వ.ఇంతలో రాధ అక్కడికొచ్చి ‘‘ప్రశాంతీ! నువ్వు రక్షించింది నా కోడలినే కాదు నా కుటుంబాన్ని కూడా’’ అంది.