వాళ్ళిద్దరూ మిత్రులు. వారిలో ఒకరు డాక్టర్‌. అతడు తన మిత్రుడింటికి వచ్చాడు. భార్య దూర తీరాలకు, బిడ్డలు దూర దేశాలకు వెళ్ళిన ఆ ఒంటరి మిత్రుణ్ణి చూడ్డానికి వచ్చాడు ఆ డాక్టర్. అతడి దిగాలు పోగొట్టేందుకు పిచ్చాపాటీ మాట్లాడుతున్నాడు. అంతలో డాక్టర్‌ మిత్రుడికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. 108ను పిలవమన్నాడు. ఈ లోపు రెండో మిత్రుడికీ హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. అప్పుడు డాక్టర్‌ మిత్రుడు ఒకవైపు గుండెపోటు భరిస్తూనే మరోవైపు ఏం చేశాడంటే....

*****************************

‘‘అయినా నాన్నగారూ...! నాకో సందేహం.ఈ హాస్పిటల్‌ ఎవరు చూసుకుంటారు? ఇంత పెద్దది. దాదాపు వందకోట్లు. ఇంకా ఎక్కువే ఉండవచ్చేమో! మీరు వ్యాపార నిర్ణయాలు ఆలోచించే తీసుకుంటారనుకోండి’’ సురేంద్ర చిన్న కొడుకు హరి తండ్రివంక చూస్తూ నసిగాడు.పెద్దకొడుకు రవి వంక చూసిన సురేంద్రకి అతని మొహంలోనూ అదే అనుమానం దోబూచులాడుతూ కనిపించింది. సురేంద్ర నవ్వుకున్నాడు.దేశం మొత్తంమీద ఎన్నదగిన శ్రీమంతులలో సురేంద్ర ఒకడు. అతనికి ఎన్ని వ్యాపారాలున్నాయో, ఎంత సంపాదించాడో లెక్కలేదు. దాదాపు అరవైయేళ్ళు వయసు వచ్చినా అతను ఇంకా సంపాదనకు ముగింపు పలకలేదు. ఇద్దరు మొగపిల్లల తండ్రి సురేంద్ర. ఐదేళ్ళ కిత్రమే భార్య మరణించింది. అప్పటికే పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. భార్య గతించిన తరువాత అతనికి సంపాదన ఒక వ్యసనంగా మారింది. ప్రతిక్షణం వ్యాపారంలో మునిగితేలే సురేంద్ర పిల్లల దగ్గరికి వెళ్లే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఎంతో ఆరోగ్యంగా ఉండే అతనికి ఇటీవలే గుండెపోటు వచ్చింది.

దానినుంచి కోలుకోగానే అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక హాస్పిటల్‌ని వందకోట్లు ఖర్చుతో కట్టించటం మొదలుపెట్టాడతను. అది పూర్తి అయింది. దాని ప్రారంభోత్సవానికి మరునాడు వాళ్ళ ఊరునించే ఎంపీగా ఎన్నికైన వీర్రాజుని ఆహ్వానించాడు సురేంద్ర. ఆ వేడుక చూడటానికి అంతకుముందు రోజే కొడుకులిద్దరూ హైదరాబాద్‌ చేరుకున్నారు.తండ్రి హాస్పిటల్‌ కట్టిస్తున్నాడని వాళ్లకి ముందే తెలుసు. కానీ దాన్ని చూశాక వాళ్ళకి మతిపోయింది. ఆయన దానితో ఎంతగా మమేకమయ్యాడో అర్థమైంది. పేదవాళ్ళకోసం ఒక హాస్పిటల్‌ కట్టిస్తున్నానని తండ్రి ఫోన్లో చెప్పినప్పుడు వాళ్ళు అదేదో పబ్లిసిటీ కోసమో లేక పన్నులు ఎగ్గొట్టటానికో అనుకున్నారు. కానీ తీరా ఈ ప్రారంభోత్సవానికి వచ్చి చూసేసరికి వారి ఆశ్చర్యానికి అంతులేదు. ఆ రకమైన వసతులతో కూడిన హాస్పిటల్స్‌ దేశం మొత్తంమీద ఒకటో, రెండో ఉంటాయంతే! వాళ్లిద్దరూ డాక్టర్లు కాదు. మరి ఎవరికోసం ఇంత ఖర్చుతో ఈ హాస్పిటల్‌ కట్టించినట్టు? అసలీ ఆలోచన ఎందుకొచ్చింది? అది తెలుసుకోవాలనేదే వాళ్ళ ప్రయత్నం.