రెండు రోజుల నుండి చెబుతూనే ఉన్నాను. ‘ఆదివారం మా చెల్లెలిఇంటికి వెళ్లి ఒక రోజు గడిపి, అలాగేఆ రోజు సాయంత్రం ఒక బంధువుల పెళ్లి రిసెప్షన్‌ చూసుకుని ఇంటికి వచ్చేద్దాం’ అని. ఈయన దేనికీ సమాధానం చెప్పరు. 

అసలు ఇల్లు వదలాలంటేనే ఆయనకు ఇష్టం ఉండదు. పోనీ ఇంట్లో ఏమన్నా వేరే పని చేస్తారా అంటే అదేం ఉండదు.ఇరవైనాలుగు గంటలూ పేపర్లూ,పుస్తకాలూ, ఆయనకు మాత్రమే నచ్చే ఇంటర్నెట్లోని కొన్ని వార్తా పత్రికల్లోని వ్యాసాలూ, ఇ - మెయిల్స్‌ ... ఇక నేను పక్కనుంటే చెప్పుకునే కబుర్లు తప్ప.ఈ మధ్య మరీ ఒంటరిగా ఉంటున్నారని పిస్తుంది. తెల్లవారి లేస్తూనే గంటన్నర వాకింగ్‌ పేరుతో బయటకు వెళ్ళిపోవడమే గానీ, ఆ తర్వాత ఎక్కడికీ వెళ్లరు. ఇంటికి వస్తూనే నేనిచ్చే కాఫీ తాగి ఆరంభించే వ్యాపకం ఇక రోజంతా సాగుతుంది. ఏమన్నా కావాలంటే బయటికి వెళ్లి ఆ వస్తువు తెస్తారు.ఈ మధ్య నాలుగు వస్తువులు చెబితే ఇంటికి మూడే వస్తాయి. మరొకటి మరిచి పోయినందుకు సారీ మాత్రం చెబుతారు.రిటైర్‌ అయినప్పటినుండి ఇదీ వరస.

సినిమాకు పోదామంటే, ‘మూడు గంటలు నేను కూర్చోలేను ... ఇంకొన్ని రోజుల్లో అది టీవీలో వచ్చేస్తుందిగా, అప్పుడు చూద్దాంలే’ అనే ఊరడింపు ఎదురవుతుంది.వయసులో నాకంటే నాలుగేళ్ళు పెద్దే, కాదనను, కానీ అప్పుడే ఇంతటి వైరాగ్యమా!అనుకున్న ఆదివారం రానే వచ్చింది.తెల్లవారి లేచి వాకింగ్‌ కోసం రెడీ అయినప్పుడే చెప్పాను ‘‘వస్తూనే స్నానం చేసేయండి. మా చెల్లి ఇంటికి వెళ్లిపోదాం. ఆ పిల్ల టిఫిన్‌కి కూడా అక్కడికే వచ్చేయమని చెప్పింది. మీకు తెలుసు కదా మనమంటే ఆ పిల్లకు యెంత ఇష్టమో’’ అనునయంగా చెప్పాను.ఒక శూన్యపు చూపుతో తలాడించి బయట పడ్డారు. ఆ చూపేంటో తలాడించడమేంటో నాకర్థం కాలేదు.ఆదివారం పూట అరగంట ఎక్కువగానే నడుస్తారు కాబోలు. ఎప్పుడూ ఆలస్యంగా వచ్చినట్లే ఈ రోజు కూడా వచ్చారు. అక్కడ ఏ చెట్లతో మాట్లాడుతారో, ఏ పక్షులతో స్నేహం చేస్తారో తెలియదు కానీ..