కాన్పూర్‌ పట్టణంలోని సర్క్యూట్‌ కాలనీ...పకడ్బందీ భద్రత నడుమ పోష్‌ బంగ్లాలు, అపార్ట్‌మెంట్‌లు ఉండే ప్రాంతం.మహిళా న్యాయమూర్తి ప్రతిభా గౌతమ్‌ ఆత్యహత్య చేసుకున్న ఇల్లు అక్కడే ఉంది.ప్రతిభ అందగత్తె. సరిగ్గా తొమ్మిది నెలల క్రితం తల్లిదండ్రులను ఎదురించి తనకిష్టమైనవాడిని ప్రేమవివాహం చేసుకుంది. ఆమె భర్త అభిషేక్‌ న్యాయవాది.ప్రతిభ చిన్న వయస్సులోనే న్యాయమూర్తి అయ్యారు. పలు కీలక కేసుల్లో ఆమె ఇచ్చిన తీర్పులు సంచలనం సృష్టించాయి. అలాంటిది ఒంటినిండా గాయాలతో ఆమె మృతదేహం తను నివాసం ఉండే క్వార్టర్‌లోని బెడ్‌రూంలో ఫ్యానుకు వేలాడుతోంది.మహిళా న్యాయమూర్తి మరణవార్త కాన్పూర్‌ ప్రజల్లో కలకలం రేపింది. వార్త వినగానే వందల సంఖ్యలో ప్రజలు, మహిళాసంఘాల వారు ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉరై ప్రాంతానికి చెందిన ప్రతిభ కాన్పూర్‌ రూరల్‌ కోర్టులో మెజిస్ర్టేట్‌గా పనిచేస్తున్నారు. అందరితో ఆమెకు మంచి సంబంధాలున్నాయి.

 అందుకే అంతమంది జనం అక్కడికి చేరుకున్నారు.పోలీసులు వచ్చి చూసేసరికి ప్రతిభ మృతదేహం ఫ్యానుకు వేలాడుతోంది.ప్రతిభ మరణించిందని కాన్పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె భర్తే.ప్రతిభ మృతదేహన్ని పరిశీలిస్తూ ఎఎస్పీ మాఽధుర్‌ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. కారణం... ఆయనకు ప్రతిభతో పరిచయం ఉంది. కొన్ని కేసుల విచారణలో భాగంగా ప్రతిభను ఆయన అనేకసార్లు కలుసుకున్నారు.‘‘మిస్టర్‌ అభిషేక్‌ మీది ప్రేమవివాహమే కదా...’’ అక్కడే విషాదవదనంతో ఉన్న అభిషేక్‌ను కదిలించాడు ఎఎస్పీ మాధుర్‌.‘‘అవున్సార్‌... మేమిద్దం మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మా నాన్న న్యూఢిల్లీలో ప్రముఖ న్యాయవాది.

నేను కూడా ఢిల్లీలోనే న్యాయవాద వృత్తిలో ఉన్నాను. ఈ యేడాదే ప్రతిభ, నేను పెళ్లిచేసుకున్నాం. ఆమె ఇంట్లో పెద్దలకు ఇష్టం లేకపోవడంతో ఢిల్లీలోని ఆర్యసమాజ్‌లో ప్రముఖుల నడుమ మా పెళ్లి జరిగింది’’‘‘ఆమె ఇక్కడ... మీరు అక్కడ ఉండేవారా...?’’‘‘వృత్తిరీత్యా తప్పలేదు. వారాంతపు సెలవుల్లో మేమిద్దరం కలుసుకుంటుండేవాళ్లం...’’‘‘మీ భార్యను మీరు చివరిసారిగా ఎప్పుడు కలిశారు?’’‘‘రెండు రోజుల క్రితం ఢిల్లీ వచ్చింది. ఒక రోజు ఉండి తిరిగి బయలుదేరింది. ఆ తర్వాత ఆమె కాంటాక్ట్‌లోకి రాలేదు. ఈ రోజు నేను ఇంటికి వచ్చేసరికి లోపలి నుంచి లాక్‌ వేసి ఉంది. తలుపుకొట్టినా తీయలేదు. ఫోను చేస్తే ఎత్తలేదు. దాంతో, చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లాను. ప్రతిభ ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది’’ అంటూ బోరుమన్నాడు అభిషేక్‌.