నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నువ్వు నడచి వచ్చిన దారి మరచిపోకు సుమా! అని ఏదోఒక సమయంలో సున్నితంగా మనల్ని హెచ్చరిస్తుంది మన జీవింతం. సమాజంనుంచి తీసుకున్నదాన్ని సమాజానికి తిరిగివ్వాలన్నది మానవధర్మం. సంఘ నియమం. ఇప్పుడు చాలామంది ఈ మౌలికసూత్రాన్ని మరచిపోయారు. మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. కానీ ఈ కథలో మాత్రం ఏం జరిగిందంటే....

 

ప్రొద్దున్నే తాతయ్య నుండి ఫోన్‌.పుట్టినరోజునాడు తాతయ్య తప్పకుండా శుభాకాంక్షలు తెలియచేస్తాడు. అది కొత్తకాదు, కానీ ‘‘కార్తీకేయా, వీలు చూసుకుని ఒకసారి హైదరాబాద్‌ రా. నీతో వ్యక్తిగతంగా ఓ విషయం మాట్లాడాలి’’ అని చెప్పటమే వింతగా ఉంది. తాతయ్యకు నాతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సింది ఏముందో నాకు అర్థం కాలేదు.‘పాత ప్రేమకథ’ ఏమన్నా చెపుతాడా లేక ఏదన్నా గుప్తనిధి నాకు రాసిస్తాడా’ నా సరదా ఆలోచనకు నవ్వు వచ్చినా ఏదో సీరియస్‌ విషయమే ఉందనే ఆలోచన నాలో ఆరంభమైంది.

ఆయనకున్న నలుగురు సంతానంలో మా నాన్న చివరివాడైతే, ఏడుగురు మనవలు, మనవరాళ్ళల్లో నేను చివరివాడిని. ప్రతి ఏడాది దీపావళికి అందరం తాతయ్యవాళ్ళ దగ్గరకువెళ్ళి పండుగ జరుపుకోవటం అలవాటు. తాతయ్య చెల్లెలు, తమ్ముడుకూడా వాళ్ళపిల్లలు, మనవలు మనవరాళ్లతోసహా వస్తారు. వాళ్ళు అందరూ తాతయ్య అంటే మహాగౌరవంగా చూపిస్తారు. సినిమాల్లోనే అలా ఉండటం సాధ్యం అనుకునేవారికి దీపావళినాడు మా తాతయ్య ఇల్లుచూస్తే నిజంగా అలా ఉండొచ్చని నమ్ముతారు. కానీ అలా రావాలని ఆయన ఒత్తిడిపెట్టరు, వెంటపడరు. కానీ అందరూ కలవటానికి ఆప్యాయతలు పంచుకోవటానికి ఆ పండగనే వేదికగా చేసుకున్నారు. బామ్మ చనిపోయిన ఏడాదిలో తప్పితే ఆ ఆలవాటు ఎప్పుడూ బ్రేక్‌ అవ్వలేదు. బామ్మ పోయినతరువాత నాలుగేళ్ళుగా తాతయ్య ఒక్కరే ఒంటరిగా ఉంటున్నారు. ఎవరెంత చెప్పినాకూడా ఆయనకు వ్యాపారంమీద అనురాగమో, డబ్బుపట్ల ఉన్న మమకారమో ఎవ్వరిదగ్గరికీ ఆయన చేరలేదు.నాన్న పాతికేళ్ళక్రితమే ముంబాయికి వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. మిగతావాళ్ళు అందరూ హైదరాబాద్‌కి దగ్గరలోనే స్థిరపడటంతో తాతయ్యను తరచు కలవటంవలన ఆయనతో చనువుకూడా ఎక్కువ. అలాంటిది మరి ‘పర్సనల్‌ మేటర్‌’ అంటూ తాతయ్య నన్నే ఎందుకు పిలిచాడో అర్థం కావటంలేదు.