ఇంట్లోంచి పారిపోయి అమెరికా చేరాడతను. పలకరించే నాథుడు లేడు. ఒంటరితనం... ఇల్లు తలుచుకుని కుమిలిపోయేవాడు. తల్లి జ్ఞాపకమొచ్చి వెక్కివెక్కి ఏడ్చేవాడు. వేరే దారిలేక అన్నిటికీ అలవాటుపడ్డాడు. మంచో చెడో... బతకడానికి రకరకాల పనులు చేశాడు. ఒకరోజు తను పనిచేస్తున్న ఇంట్లో గోడకు తగిలించి ఉన్న ఫోటో చూశాడు. అంతే! ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. కన్నీళ్ళు ధారలు కట్టాయి. ఇంతకీ ఆ ఫోటో ఎవరిది? ఆ ఫోటో వెనుక కథేమిటి?

సుబ్రహ్మణ్యానికి పదేళ్ళ వయసు.వాణ్ణి సుబ్రహ్మణ్యం అని పొడిగా పిలిస్తే వాళ్ళ నాన్న పరమేశ్వరశాస్త్రి ఒప్పుకోడు. సుబ్రహ్మణ్య శర్మ అని పూర్తిపేరుతో పిలవాల్సిందే! లేకపోతే తన తండ్రిపేరు వాడికి పెట్టినందుకు ఆయన ఆత్మ క్షోభిస్తుందని శాస్త్రి నమ్మకం.‘‘వేదం చదువుతావా? స్మార్తం చదువుతావా’’ అని అడిగాడు పరమేశ్వరశాస్త్రి సుబ్రహ్మణ్యాన్ని ఒకరోజు.‘‘ఇంజినీరింగ్‌ చదువుతా’’ జవాబిచ్చాడు సుబ్రహ్మణ్యం.‘‘నోరు మూసుకుని వేదం చదువు. ఇంగ్లీషు చదువు పదవ తరగతి వరకు చాల్లే. పిచ్చి పిచ్చి వేషాలేశావంటే కాళ్ళిరగ్గొడతా సుబ్బిగా, జాగ్రత్త’’ అని శాసించాడు వాళ్ళ నాన్న.వాళ్ళ నాన్న వేదం సంత చెప్పినంతసేపూ శ్రద్ధగా పలికే సుబ్రహ్మణ్యానికి, ఆయన అవతలికి వెళ్ళాక గూడా దాన్ని వల్లె వేసుకోవాలంటే చిరాగ్గా ఉండేది.

పైగా దానివల్ల తన థర్డ్‌ఫారం చదువు కుంటుపడేది. హాయిగా తోటి పిల్లలతో చేరి గోలీలూ, బొంగరాలూ ఆడుకుంటూ, గాలిపటాలు ఎగరేసుకుంటూ తిరగాలని వాడికి కోరిక. ఆ ఆటలు ఆడితే, ముఖ్యంగా బ్రాహ్మణేతర పిల్లలతో కలిసి ఆడితే పిల్లవాడు ఎందుకూ కొరగాడని శాస్త్రి ఉద్దేశం. అందుకని కొడుకుని ఎప్పుడూ వెయ్యి కళ్ళతో కనిపెట్టుకుని ఉండేవాడు.ఓరోజు సుబ్రహ్మణ్యం స్నేహితుల ప్రోత్సాహంతో బీడీ తాగాడు. ఇంటికి రాగానే ‘మదీయాస్యగంధమ్మాఘ్రాణము’ చేయమని వాడడగకపోయినా, శాస్త్రి స్వయంగా నోరు వాసన పసిగట్టి, వాణ్ణి కవ్వం తాడుతో తరిమితరిమి కొట్టాడు.సుబ్రహ్మణ్యం ఇంట్లోంచి పారిపోయాడు.వాడికి విశాఖపట్టణంలో తనుండే ఇల్లూ, బడీ తప్పించి ఇతర ప్రపంచం ఏమీ తెలీదు. నడుస్తూ నడుస్తూ పోగా హార్బరు వచ్చింది. ఆకలి భరించలేక అక్కడ మీసాలతో కనబడిన ఓ తెల్లాయనని తినడానికి ఏమైనా పెట్టించమని అడిగాడు.