అతడిది.. ఆమెది.. ఒకే ఆఫీసు.. అతడికి పెళ్లయిందని తెలిసినా సహజీవనం చేసిందామె.. అతడి కుటుంబానికి ఏమాత్రం ఇబ్బంది రానీయనని ప్రమాణం చేసింది.. అన్నట్లుగానే ఎన్నో ఏళ్లు వారి సహజీవనం సాఫీగా సాగింది.. ఉన్నట్టుండి అతడికి ప్రమోషన్.. అమెరికాకు బదిలీ.. ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది.. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు వచ్చినా.. రాకపోకలు నిలిచిపోయాయి. అతడి నుంచి ఫోన్‌కాల్స్ కూడా ఆగిపోయాయి.. కానీ ఆమె మాత్రం అతడి కోసమే ఎదురుచూస్తూ ఉండిపోయింది.. చాలా ఏళ్ల తర్వాత సడన్‌గా అతడి నుంచి ఫోన్ కాల్.. ప్రియుడు చెప్పింది విని.. 

**************************

అది అనైతికం అనుకోలేదు అప్పుడు.ఇప్పుడూ అనుకోవటం లేదు. తొలిసారి అతనితో కలయిక ఓ ఆపుకోలేని ఉద్వేగం, ఉద్రేకం. ఏదో నియంత్రించుకోలేని ఆకర్షణ. నాకు ఎవరూ లేరు, ఏ బంధనాలూ లేవు. కానీ అతని విషయం అలాకాదు. పెళ్ళి అయింది. భార్య ఉంది. మొదటికలయిక తర్వాత ఇద్దరం కలిసి నిర్ణయించుకున్నాము. తామిద్దరి సంబంధం ఏ రకంగానూ, అతని కుటుంబానికి ఇబ్బంది కాకూడదని. అలాగే రోజులు గడుపుతూ వచ్చాము. గడిచాయి కూడా.ఇద్దరిదీ ఒకే ఆఫీసు. అందువల్ల కొంత అనుకూలత ఏర్పడింది. ఇద్దరూకలిసి మాట్లాడుకున్నా, తిరిగినా, షికార్లుచేసినా కొలీగ్స్‌ అనే కవచం బాగా ఉపయోగపడింది. అయితే, అలాంటి అవకాశం ఉందనీ, ఎవరైనా అడిగినా ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం అనే వంక చెప్పొచ్చు అనీ, ఆ పేరుతో మేం ఇష్టం వచ్చినట్టు చెడతిరగలేదు.

ఎంతో జాగ్రత్తగానే గడిపాం. అలా అని ఇద్దరి సంతోషానికి ఇబ్బందేమీ కలగలేదు.తనపేరు రామారావు. అయినా రామూ అని పిలిచేదాన్ని. సుజాత అని పూర్తిపేరుతో పిలవకుండా తనుకూడా ‘సుజా’ అనేవాడు. పరాయిసంబంధం అన్నాక, ఏదోఒకరకంగా తేడా రావటానికే అవకాశం ఎక్కువ. ఈగో ఇష్యూలు వస్తాయి. కానీ తమ మధ్య అలాంటివేమీ రాలేదు. వాళ్ళ కుటుంబమే ముందు అనేదేకాదు, న్యాయంగా ఆ అధికారం కూడా ఆ కుటుంబానికే ఉంటుంది. తనదిమాత్రం, వాళ్ళమధ్యకి వెళ్ళినబంధం. తనది మనోబంధమేగానీ, అధికారబంధంకాదన్న ఆ విజ్ఞతే నన్ను మొదటినుంచి కాపాడుతూ వచ్చింది.చిన్నచిన్న గొడవలు, చిరుకోపాలు రాకపోలేదు. అలాంటప్పుడు రామూయే ముందు నన్ను బతిమాలేవాడు, లేదా తనే సరిపెట్టుకునేది.రెండుకుటుంబాలుగా సాగటంలో ఆర్థిక ఇబ్బందిలాగే మరో ప్రధానమైన ఇబ్బంది సమయం.

ఓ పండగ వచ్చిందీ అంటే, ‘ఆ రోజు రామూ ఎక్కడ గడపాలి? అక్కడ భార్య పిల్లలతోనా? తనతోనా?’ ఇద్దరూ కలిసి మాట్లాడుకునేవాళ్ళం. ఈ టైమునుంచి ఈ టైముదాకా తనతో ఉండమని చెబితే, రామూ సరే అనేవాడు. అలా కుదరక ఏదేనా ఇబ్బంది ఉంటే చెప్పేవాడు. తను సర్దుకునేది. ఇద్దరికీ ఉద్యోగాలు, నెల అవగానే ఠంచన్‌గా జీతాలు, అందువల్ల ఆర్థిక ఇబ్బందులేమీ లేవు.