దేశంకాని దేశంలో అతను ఒకళ్ళింటికెళ్ళాడు. ఆ ఇంట్లో తొంభైయేళ్ళ వృద్ధురాల్ని కొడుకు తట్టిలేపి ‘తెలుగువారు వచ్చారు’ అని చెప్పాడు. ఆమె లేచి ‘ఒవుళు’ అంది బొక్కినోటితో. ‘సరిగ్గా కూర్చోతల్లీ’ అన్నాడు ఆ వచ్చినతను. అంతే! ఆమెకు ప్రాణం లేచొచ్చినట్టైంది. ‘తల్లీ అన్నావా బావూ నన్ను! ఎవురు బావూ తమరు? ‘ఎంతదృష్టం బావూ! నాను సచ్చిపోయేనోగా, తెలుగుమాట ఇంటాననుకోనేదుబావూ! అంది ఆర్ర్దహృదయంతో. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే......

************************************

ఓ రోజు సాయంత్రం నేనూ, రామచంద్రుడూ, ముకుందం, రామకృష్ణాబీచ్‌లో కూర్చున్నాం. రామచంద్రుడి వయస్సు దాదాపు డెబ్భైసంవత్సరాలుపైనే ఉంటాయి. మేల్‌నర్స్‌గా చాలా అనుభవంతో రెండు మూడు దేశాలు వెళ్ళాడు. ఆరోగ్యంపట్ల జాగ్రత్తలుతీసుకోవడంవల్ల కాబోలు ఎంతో ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటాడు. అతని మిత్రుడు ముకుందం. అతడు రచయిత కూడానట.బీచ్‌లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న మాకు, మాటలమధ్య మాతృదేశం ప్రస్తావన వచ్చింది. ఆ మట్టివాసనా, తప్పనిపరిస్థితులలో విదేశయానంచేసి, తిరిగి స్వదేశంచేరుకుని ఆ పరిమళాలు ఆస్వాదిస్తున్న దేశాభిమానులవైపు మళ్ళింది. మా, మా అనుభవాల నేపధ్యంలో, నా చిన్న అనుభవం గుర్తొచ్చి చెప్పడం మొదలెట్టాను.‘‘అది అమెరికాలోని అరిజోనా రాష్ట్రం. ఫినిక్స్‌ దాని ముఖ్యపట్టణం. అక్కడ మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు.

వెల్స్‌ స్ట్రీట్‌లో ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌లో ఓ నలుగురు మన ఇండియన్ కుర్రాళ్ళతో షేర్‌ చేసుకుని ఉండేవాడు. అది మండే వేసవికాలమే అయినా, సూర్యాస్తమయం అయ్యేసరికి చలి మొదలయ్యేది. అందువల్ల అక్కడి రూమ్‌మేట్‌, ఎవరువచ్చినా, వారికి ఇల్లు అప్పజెప్పి నేను వాకింగ్‌కి బయలుదేరేవాడిని. ఆ ప్లాట్లలోంచి బయటపడి మెయిన్‌రోడ్డుమీదకు రావాలంటే, కార్లు లోనికివచ్చేవైపు అయితే తప్పనిసరిగా కార్డ్‌ స్వైప్‌ చెయ్యాలి. ఆ పక్కన ఎక్కడా వాకర్స్‌కి మార్గం లేదు. అయితే మరోవైపు మనం హాయిగా బయటకుపోయి లోనికి రావచ్చు. అయితే ఈ త్రోవ కాస్త ఇరుకు.బయట పెద్దబోర్డు ఉండేది. దానిపై ఇందులో ఎన్ని ప్లాట్లున్నాయో, వాటి నెంబర్లు ఏమిటో వివరిస్తూ, ఇది చాలా ‘‘సేఫ్‌ లొకేషన్‌’’ అనీ, అద్దెలు అందుబాటులో ఉంటాయనీ వ్రాసి ఉండేది. నాకు ‘సేఫ్‌ లొకేషన్‌’ అనే మాట అర్థం కాలేదు మొదట. చాలా అపార్ట్‌మెంట్‌లముందు ఇలాంటి బోర్డులు చూసిన తరువాత, నేను గమనించినదేమంటే, ఈ దేశం ‘గన్‌ కల్చర్‌’ దేశం. ఎవడెప్పుడు, ఎవర్ని కాల్చి చంపుతాడో తెలియదు. ‘సేఫ్టీప్లేస్‌–’ అదీ దాని తాత్పర్యం.