స్నేహితుడి కూతుర్ని ఇచ్చి కొడుక్కు పెళ్లి చేశాడు.. భార్య చనిపోయాక తన గదిలోనూ ఉంటూ ఆమె జ్ఞాపకాలతోనే కాలం గడిపేస్తున్నాడు. అమెరికా రమ్మని కూతురు కోరినా వెళ్లలేదు.. కానీ కొత్తగా వచ్చిన ఆ కోడలు తన నిజస్వరూపం చూపించింది. ఆమేంటో ఆ ఇంట్లో అందరికీ తెలిసేలా చేసింది. పెళ్లైన మూడో రోజే తన మాటలతో భర్తకు ఊహించని షాకిచ్చింది.. చివరకు ఏం జరిగిందంటే.. 

***************************

‘‘నాన్న గదిలో చేరి ఏంట్రా ఆ గోల?’’అమ్మ బిగ్గరగా అరవటంతో అక్కా, నేను పిల్లలూ బయటకొచ్చాం.‘‘అయినా నాన్నగారు ఇక్కడ లేరుకదమ్మా మమ్మల్ని ఆడుకోనీ! బయటయితే ఎండ, వడగాలి అంటావ్‌ వరండాలోకి కూడా వెళ్ళనీయవ్‌!’’అమ్మతో అయితే వాదించవచ్చు ఫరవాలేదు అదే నాన్నగారితో...బాబోయ్‌ నోరెత్తటానికి వీల్లేదు.అప్పుడు అమ్మ ‘‘అలాగేం..నాన్నరానీ మీ ఇద్దరిసంగతీ తేలుస్తాను’’ అంటూ అలవాటుగా మమ్మల్ని బెదిరించిది.

‘‘ఊరుకోరా! నాన్నకి తెలిస్తే...!’’ అక్క భయంభయంగా అంది. అక్క చిన్నప్పట్నించీ అంతే చాలా పిరికిది. నేను గడుగ్గాయిని.‘‘అమ్మ చెప్తేనే కదా నాన్నకి తెలిసేది, తన గదిలో ఆడుకున్నామని!’’ అమ్మని విలన్‌ చేస్తున్నట్టు అన్నాను.‘‘ఎట్లా తెలుస్తుందేం! నాన్న పక్కమీద దుప్పటి ఎలా నలిగిందో చూడు! ఆయన కుదురుగా సర్దుకున్న పుస్తకాలన్నీ ఎలా చిందరవందరచేశారో చూడండి! నాకే ఇంత గజిబిజిగా ఉంటే మీ నాన్నగారికి ఆ మాత్రం తెలీదా? మీకేం, ఆయన వచ్చే టైమ్‌కి నిద్రనటిస్తూ ఉంటారు. మీవల్ల నాకు చీవాట్లు!’’ పాపం అమ్మ తన కష్టం ఏకరువు పెట్టింది.

ఇంతలోనే మెలకువ వచ్చేసింది. ఇదంతా నా కల! అమ్మపోయి పదేళ్లుదాటినా నాకు ఈ మధ్య తరచుగా కలలోకి వస్తోంది.ఆ కలలో అమ్మతోపాటు కాలచక్రంలో నేను అక్క ముప్ఫైఏళ్లు వెనక్కి వెళ్లాం. అక్కా, నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమ్మతో గడిపినరోజులు ఎంత బాగుండేవి! అమ్మ మరణంతో మా అందరి జీవితాలు బోసిపోయాయి. ఇక అక్క అక్కడ అమెరికాలో తన సంసారం, ఇద్దరు పిల్లలు ఉద్యోగంతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. శని, ఆదివారాల్లో మాత్రం సంతోషంగా నాన్నతో, నాతో కబుర్లు చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడేది వారానికే!