శంకరానికి పరమానందమంటే పరమ చిరాకు మొదలైంది.‘‘అది కాదురా శంకూ’’ అంటూ ప్రతిదానికీ ఎగేసుని వస్తుంటాడు.‘‘ఈ జోక్‌ విన్నావా...’’ అని జోక్‌ చెప్పి సీరియస్‌గా ఉండే శంకరం ముఖాన్ని చూసి ఫక్కుమని మరీ నవ్వేస్తుంటాడు.

‘‘ఇంతమంచి జోక్స్‌కి నవ్వు రాకపోవడమేంటోయ్‌...కొంపదీసి హాస్యగ్రంథులు కుంచించుకు పోయాయా ఏంటి? ఏదీ నోరు తెరువూ?’’ అని బలవంతంగా నోరు పగలదీస్తాడు. అలా పరమానందం నోరు పగలదీయడం గుర్తొచ్చి శంకరం బలవంతంగా నవ్వేస్తూ ఉంటాడు. ఇంతాకష్టపడుతూ పరమానందం ప్రాంగణంలో ఉండడానికి శంకరానికి ఉండే ఒకేఒక్క రీజన్‌ పరమానందం హౌస్‌ ఓనర్‌ కావడం, తను టెనెంట్‌ కావడం.ఇల్లు ఖాళీచేసి మరో ఇంట్లో చేరడమంటేనే ఓ పెద్ద నరకం.పిల్లి మారినట్టు ఇల్లుమారడం అంత ‘వీజీ’ కాదు. ఇల్లు ‘ఖాళీ’ చేసిన ప్రతీసారి శంకరం భార్య శ్రీలక్ష్మి నడుమునొప్పని మంచం పైకి చేరుతుంది. శంకరానికి సపర్యలు చేయడం తప్పనిసరి అవుతుంది. శ్రీలక్ష్మి కోలుకునేలోపు ఇంటెడుచాకిరీ చేయలేక శంకరం మంచానపడుతుంటాడు.

శంకరానిది అదోలాంటి మనస్తత్వం. ‘‘ఖర్చు దండగ ఎందుకు?’’ అని చిన్నచిన్నవి కూడా కొనడానికి అయిష్టత చూపిస్తూ ఉంటాడు.ఆ మధ్య ఒక ఇంట్లో చేరినప్పుడు ఇంటి ఎదురుగా ఖాళీస్థలం ఉండేది. ఉదయం లేచేసరికల్లా ఆ స్థలం ఒక చెత్తదిబ్బలా తయారయ్యేది. గార్బేజీవాళ్ళకి వందరూపాయలు ఇవ్వడం ఎందుకు దండగ అని కక్కుర్తిపడేవాళ్ళందరూ రాత్రికిరాత్రి చెత్త తీసుకొచ్చి శంకరం ఉండే ఇంటిముందు స్థలంలో వేసి వెళ్ళిపోయేవాళ్ళు. అలా చెత్తవేయడంవల్ల అది కుళ్ళి అందులో దోమలు వేలాదిగా పుట్టి, ఎదురుగా ఉన్న శంకరం ఇంట్లోకి దూరిపొయ్యేవి. దాంతో రోజూ రాత్రుళ్ళు శంకరం మస్కిటోబ్యాట్‌తో టపాకాయలు పేల్చినట్టు దోమల్ని కొట్టుకుంటూ కూర్చొనేవాడు.