ట్రింగ్‌.. ట్రింగ్‌..

టైము తొమ్మిదింపావు. స్కూలు బెల్లుకొట్టగానే పరుగులు పెట్టే పిల్లాడిలా సూరీడు దూసుకొస్తున్నాడు. అప్పటికే సెంటర్లో సగం షాపులు తీసేశారు. ఇంకొన్ని షర్టర్లు మెల్లమెల్లగా తెరచుకుంటున్నాయి. గతుకు రోడ్డుపై సర్కసు ఫీట్లు చేస్తూ.. దూకుతోంది నా సైకిలు. ఈమధ్యే సెకండ్‌ హ్యాండులో చీప్‌గా వస్తే కొన్నా. కండీషన్లోనే ఉంది. కానీ ఎందుకో అప్పుడప్పుడూ మొండికేస్తుంటుంది.

టక్‌... టక్‌... టక్‌ఫెడల్‌ దగ్గర ఒకటే సౌండు. మధ్యలో ఓసారి చైను ఊడిపోయింది. రోడ్డుమీద పుల్ల ఏరుకుని.. దాని సాయంతో అతి కష్టమ్మీద చైను ఎక్కించేశాను. ఎందుకైనా మంచిదని వెనుకనున్న క్యారెజీకి పుల్లని తలిగించా. సైకిలు స్పీడందుకుంది.ట్రింగ్‌.. ట్రింగ్‌...ఈపాటికి సూరిబాబు షాపు తెరిచేసి ఉంటాడు. క్యాసెట్లు కూడా వచ్చేసుంటాయి. తొలి క్యాసెట్‌ కొనకపోతే.. నా పరువేం కానూ? ఆఖరికి సూరిబాబు కూడా నన్ను వేళాకోళం చేయడం మొదలెడతాడు. ఇంతకీ పాటలెలా ఉన్నాయో? ఇళయరాజా కదా, డౌటెందుకు... అదరగొట్టేసుంటాడు. ఇళయరాజా గుర్తుకురాగానే కొత్త ఉత్సాహం వచ్చేసింది.‘‘చల్తీ కా నాము గాడీ..చలాకీ వన్నెలేడీ...రంగేళీ జోడీ.. బంగారు బాడీ..’’ పాట అనుకోకుండానే మనసులో ప్లే అయిపోయింది.

దానికి తగ్గట్టుగా.. ఫెడల్‌పై కాలు లయబద్దంగా నాట్యమాడుతోంది.ట్రింగ్‌.. ట్రింగ్‌...‘అభిలాష’తో అనుకుంటా. ఇళయరాజా పాటకు అభిమానినైపోయా. మిగిలిన వాళ్ల పాటలు వింటూ మనం నిద్రపోతే.. ఇళయరాజా పాటలు విని సంగీతం కూడా హాయిగా నిద్రపోతుంటుంది. అదీ ఆయన మ్యాజిక్కు. అందుకే ఆయనంటే అంతిష్టం. ‘సాగర సంగమం’, ‘సితార’, ‘ఛాలెంజ్‌’, ‘ఆలాపన’ - ఇలా సినిమా సినిమాకీ పిచ్చి పెరిగిపోయింది. గణపతి నవరాత్రులు, దసరా ఉత్సవాలు, సంక్రాంతి సంబరాలు.. ఏదైనా సరే, స్టేజీ మీద ఇళయరాజా పాట పాడడం, ప్రెసిడెంటు చేతుల మీదుగా ప్రైజు అందుకోవడం.. నాకు కొన్నేళ్లుగా అలవాటైపోయిన విషయాలు. మా ఊళ్లో కూడా నన్ను జూనియర్‌ బాలసుబ్రహ్మణ్యంలా చూస్తుంటారు. అలా పాటతో ప్రాణం ముడిపడిపోయింది. ఇళయరాజా క్యాసెట్‌ వస్తోందంటే.. అందరికంటే ముందు నేనే కొనాలి. ఆ పాట అందరి కంటే ముందు నేనే ప్రాక్టీసు చేయాలి.