‘‘భామనే సత్యభామనే! –ఒయ్యారి ముద్దుల సత్యభామనే!పదయారువేల కోమలులందరిలోనా – భామనే సత్యభామనే!రామరో! గోపాలదేవుని ప్రేమనూ దోచినదానా – భామనే...!’’భామాకలాపం చేస్తూ, అద్భుతంగా అభినయిస్తోంది నర్తకి స్వాతి. ఆ అభినయం. ఆ లావణ్యం అత్యంత సహజంగా ఉంది. గుండ్రని ముఖారవిందం, తీర్చిదిద్దిన కనుబొమ్మలు. చురుకుగా కదులుతున్న నల్లని కనుగడ్లతో పెద్దగా కనిపిస్తున్న కాటుకకళ్ళు! 

కనకాంబరాల మాలలు ముడిచిన కొప్పు, నొసట గంధపు తిలకం, పాపిట బంగారుబిళ్ళ, మెడలో కెంపులు పొదిగిన ముత్యాలహారం, ఎరుపు–చిలకపచ్చరంగుల కలనేతలపట్టుచీర, నాట్యం చేసేటప్పుడు పువ్వులా విచ్చుకుంటూ, ముడుచుకుంటూ పాదాలమీదకు జీరాడే కుచ్చిళ్ళు, జఘనాలను దాటి, ఆమెతోపాటు అంతే లావణ్యంగా నర్తిస్తున్న పూలజడ! తాళానికి తగినట్లు సన్నగామోగే చిరుగజ్జెలసవ్వడి! వెరసి మొత్తానికి కావ్యనాయిక. సౌందర్యగర్విత సత్యభామను నిండా ఆవాహనం చేసుకున్న ఆమె శరీర భాష!– ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది.ఇంతటి అందగత్తె, ఇంతటి హొయలు, లావణ్యం కలిగిన ఈ సత్యభామను నిజజీవితంలో పొందగలిగిన అదృష్టవంతుడి మీద అపారమైన అసూయ వేసింది నాకు! నిజానికి. నేను ఈ పాటికీ లేచి వెళ్ళిపోవాల్సింది. కానీ స్వాతిగారి అభినయాన్ని చూసి మంత్రముగ్ధుడనైపోయాను.

ఈ కార్యక్రమం గురించి మా పత్రికకు వార్త రాయడానికి వచ్చిన నాకు, కావలసిన వివరాలన్నీ నిర్వాహకులు ముందే ఇచ్చారు. ప్రధాననర్తకి, పక్కవాయిద్యాలు, గాయకులు, నిర్వహించేసంస్థ బాధ్యులపేర్లు, రెండుమూడు ఫొటోలు నేను వార్త రాయడానికి సరిపోతాయి. ఒక ఫొటో, అందరిపేర్లతో కూడినవార్త! ఇంతకంటే పెద్దగా అవసరం లేదు. నాకే కాదు, పాఠకులకు అవసరంలేదు. నర్తకి నర్తిస్తున్న కీర్తనగానీ, దానిగురించిన సమయసందర్భాల వివరాలుగానీ ఎవరికీ పెద్దగా చదివే ఆసక్తి ఉండదు, ఏ కొందరికో తప్ప!

వాటిని ఆసక్తిగా మలచి పాఠకులకు అందించేటంతటి పాండిత్యం మాకూలేదు! పాండిత్యం పెద్దమాట అవుతుందేమోగానీ, ఇలాంటి విషయాల్లో కనీస పరిజ్ఞానం కూడా లేనివాళ్ళం. కల్చరల్‌ రిపోర్టర్‌గా ఇలాంటి క్లాసిక్‌ ఈవెంట్స్‌ గురించి ఇన్ఫర్మేటివ్‌గా రాయడంతప్ప లోతుగా విశ్లేషించేది ఉండదు. అందులోనూ మన తెలుగుదినపత్రికలలో అలాంటి లోతైన విశ్లేషణలకు తావుకూడాలేదు. అంతగా అవసరమనుకుంటే ఆ కళాకారుల ఇంటర్వ్యూనో, ప్రొఫైల్‌నో తెమ్మంటారుతప్ప అంతకుమించి మరేమీ ఉండదు.