‘‘పిల్లలూ, దేవుడూ, చల్లనివారే...కల్లకపటమెరుగని కరుణామయులే...’’బాలల దినోత్సవం సందర్భంగా ఎఫ్‌.ఎం. రేడియోలో ప్రత్యేక గీతం వినవస్తోంది.కానీ, ఆ పాట మాలతి చెవిలోకి ఎక్కలేదు. ఎందుకంటే తల్లిచెప్పిన మాటలే ఆమె మనసులో గుర్తుకొస్తున్నాయి.

‘‘మొక్కై వంగనిది మానై వంగునా అన్నారు పెద్దలు. చూసిన ప్రతీదీ కావాలని అడుగుతారు పిల్లలు. నలుగుర్నీ చూసి నేర్చుకుంటారు. మట్టిముద్దల్లాంటి పిల్లల్ని మనమే గొప్ప ఆకృతుల్లో శిల్పాల్లా తీర్చిదిద్దాలి. కొంచెం కఠినంగా ప్రవర్తించినాగానీ, వాళ్ళకి మంచిదారి చూపించాలి. ఈ రోజు జాలి చూపిస్తే వాళ్ళిక మొండిగా తయారవుతారు’’అవునవును. నన్నూ, తమ్ముణ్ణీ కూడా అమ్మ అలాగేకదా పెంచింది. అన్నిటికీ ‘సరే’ అంటే ఈతరం పిల్లలతో చాలా కష్టం.‘‘మమ్మీ...ఈ రోజు మా క్లాస్‌లో శ్రావ్య బర్త్‌ డే. ఎంతమంచి డ్రెస్‌లో వచ్చిందో! ఇదిగో, క్లాస్‌లో పిల్లలందరికీ ఈ పెనపెన్సిల్స్‌, చాక్లెట్స్‌ పంచిపెట్టింది’’ కళ్ళు మిలమిలా మెరుస్తుండగా చెప్పింది ఏడేళ్ళ నిత్య.

‘‘సరే...సరే...ముందు నువ్వెళ్ళి ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కుని రా, పాలు తాగుదువుగానీ’’ కూతురు లంచబ్యాగ్‌లోంచి టిఫిన బాక్స్‌లు బయటకు తీసి సింకులో పడేస్తూ అంది మాలతి.‘‘ఓకేగాని. నా బర్త్‌డేక్కూడా అంతకంటే మంచి డ్రెస్‌ కొనిపెడ్తావుగా మమ్మీ!’’ భుజాలచుట్టూ చేతులువేసి గారంగా అడిగింది నిత్య.‘‘ఇంకా నెలరోజుల టైముందిగా. అలాగేలే. నువ్వెళ్ళి హోంవర్క్‌, ఎఫ్‌.ఏ ఎగ్జామ్‌కి ప్రిపేరయ్యే పని చూడు ముందు’’ కూరలు తరుగుతూ చెప్పింది మాలతి.గబగబా ఫ్రెషప్‌ అయ్యి పాలుతాగి తన గదిలోకెళ్ళి హోంవర్క్‌ చేసుకునేపనిలో నిమగ్నమైంది నిత్య. ‘‘ఏమిటోయ్‌. భోజనం చేయకుండా ఏదో ఆలోచనలో పడ్డట్టున్నావ్‌?’’ అడిగాడు సుమన్‌.‘‘ఏం లేదండీ., నిత్య బర్త్‌ డే షాపింగ్‌ గురించే’’ అంది మాలతి.