ఆడది పిల్లల్ని కనడానికే, మగవాడు యుద్ధం చెయ్యడానికే అన్నాడో మూర్ఖుడు. నిజమే, స్ర్తీ పిల్లల్ని కనడమేకాదు, మనిషికి ఉండే జాలి, దయ, కరుణ, ప్రేమతత్వం, సున్నితభావాలు, వీటన్నింటినీ మించిన పరోపకార దృక్పథం ఒకరకంగా స్ర్తీ సొంతమనే చెప్పాలి. అలాంటి గొప్ప తల్లులు తమ బిడ్డలకు ఆస్తిపాస్తులుగా పంచి ఇచ్చేది వాటినే. ఈ కథలో కూడా సావిత్రమ్మ పరోపకారమే జీవితంగా బతికింది. మరి ఆమె బిడ్డలు ఆమె ఆశయాలు నెరవేర్చారా? లేదా?

*******************

‘‘పల్లవీ! అమ్మ ఎక్కడికెళ్ళింది?’’ఆఫీసునుంచి వస్తూనే అమ్మ కనబడకపోయేసరికి కంప్యూటరు చూసుకుంటున్న చెల్లినడిగాడు.‘‘సాయంత్రం ఏం తోచడంలేదని దీక్షితులుగారింటికి వెళ్ళింది అన్నయ్యా!’’‘‘దీక్షితులుగారెవరు?’’ తెల్లబోయాను.ఉద్యోగం రాగానే ఇక్కడ అద్దెకు చేరి ఏడాదైనా చుట్టుపక్కలవాళ్లెవరూ నాకు పరిచయంలేదు. కారణం నాకు తెలుసు. పొద్దుటే టిఫిను బాక్సు పట్టుకుని ఆఫీసుకు వెళితే మళ్లీ రాత్రి పదిగంటలకేగా నేను ఇల్లు చేరడం!‘‘దీక్షితులుగారంటే సెకండ్‌ ఫ్లోర్‌లో ఉండే బ్యాంకు మేనేజరుగారు. ఆయన మనవరాలు అమ్మకు బాగా చేరికయింది. వారంరోజులుగా వారి కోడలితో కలిసి ఆ పాపను తీసుకుని తనూ పార్క్‌కి వెళుతొంది. ఏడవుతోందిగా. ఈపాటికి తిరిగి వస్తూండాలి.’’‘‘అమ్మ ఇన్నాళ్ళూ పడిన కష్టం చాలదా? హాయిగా రెస్ట్‌ తీసుకోవచ్చుగా?’’ ముద్దుగానే విసుక్కున్నాను.పల్లవి నవ్వింది. ‘‘అమ్మ సంగతి నీకు తెలియదా అన్నయ్యా! ఏళ్ల తరబడి ఒక్క క్షణం కూడా ఏనాడూ ఖాళీగా ఉండలేదు. ఎవరు సాయం అడిగినా పరుగులు తీసే అమ్మకు ఇక్కడ ఖాళీగా ఏం తోస్తుంది.

ఈ పదిహేను రోజుల్లోనే అపుడే ఈ చుట్టుపక్కవాళ్లను పరిచయం చేసేసుకుంది. అయినా ఇవాళ నువ్వు పెందరాళే వచ్చేశావు అన్నయ్యా?’’నిజమే. అందరూ మా కొలీగ్‌ కొడుకు బర్త్‌ డే పార్టీ ఇస్తున్నాడని త్వరగా వెళ్ళిపోయారు. వేరే పనుందని కొలీగ్స్‌కి చెప్పి నేను వచ్చేశాను.‘‘కొత్తగా పెళ్ళైనవాడిలా ఏమిటి లక్ష్మణ్‌ ఈ మధ్య త్వరగా ఇంటికి పరుగెడుతున్నావ్‌! లవ్‌లో పడ్డావా ఏమిటి?’’ అంటూ కొందరు జోక్‌ చేశారు కూడాను. ‘‘ఛ అలాంటిదేమీ కాదు, మా అమ్మగారిని తీసుకొచ్చాను’’అవకాశం దొరికినప్పుడైనా త్వరగా ఇల్లు చేరితే అమ్మతో కబుర్లు చెప్పుకోవచ్చని నా ఆశ. అసలు విషయం ఏమిటంటే, పల్లవికి ఓ మంచి సంబంధం ఉందని లంచ్‌ అవర్‌లో మధ్యవర్తి ద్వారా తెలిసింది. అమ్మతో దాని గురించి చెప్పాలనే హుషారుగా వచ్చాను.