అతడి అందాన్నిచూసి ఎందరో అమ్మాయిలు ఫిదా అయిపోయారు, అతడిచుట్టూ తిరిగారు. కానీ అతడు అందరికీ ఓకే చెప్పాడు. అందరినీ వాడుకోవాలని చూశాడు. కొందరిని వాడుకున్నాడు కూడా! సంధ్య కూడా అతడి చుట్టూ తిరిగింది. కాకపోతే ఇంకా ఆమె లొంగిపోలేదు. కానీ ఈలోపు ఏం జరిగిందంటే....

*************************

‘‘పెళ్ళి చేసుకుంటున్నావటగా...’’ సూటిగా అడిగాను.మన్మథరావు జవాబు చెప్పలేదు.‘‘నువ్వు పెళ్ళి చేసుకుంటున్నావటగా!’’ ఈసారి అతడి మొహంలోకి చూస్తూ రెట్టించాను.‘‘ఆ వార్త నీదాకా వచ్చిందన్నమాట!’’ తాపీగా సమాధానం చెప్పాడు. ‘‘అంటే, అందరికీ తెలుసు. నాకే తెలియదన్నమాట!’’ ఉక్రోషంగా అన్నాను.‘‘అవును సంధ్యా! చేసుకుంటున్నాను. పెళ్ళి చేసుకుంటున్నాను’’ స్థిరంగా అన్నాడు.‘‘మరి నాకు ఇచ్చినమాటో.....’’‘‘ఏ మాట?’’‘‘నన్ను చేసుకుంటానని మాట ఇచ్చావు?’’‘‘నీకు మాట ఇచ్చినమాట నిజమే? నీకే కాదు, రజనీకీ, యామినీకీ కూడా మాట ఇచ్చాను! నీకూ ఇచ్చాను. అంతేగానీ, వాగ్దానం చెయ్యలేదుగా!’’ చాలా తేలికగా తీసుకున్నాడు.‘‘అంటే...మాట వేరు, వాగ్దానం వేరునా...’’ సందేహంగా అడిగాను.‘‘మాట అంటే ఒట్టి మాట! వాగ్దానం అంటే ప్రామిస్‌. అర్థమైందా! నా కాబోయే భార్యకు ప్రామిస్‌ చేశాను!’’‘‘అయితే నాకు ఒట్టి మాట ఇచ్చావన్నమాట!’’‘‘అంతే! నీకు మాట మాత్రమే ఇచ్చాను!’’‘‘ఇంతకాలం నా చుట్టూ తిరిగావ్‌! నాతో షికార్లు చేశావ్‌! సినిమాలు చూశావ్‌, హోటళ్ళలో డిన్నర్లు చేశావ్‌? అంతా నాటకమేనా!’’ భరించలేకపోయాను.

‘‘కూల్‌ సంధ్యా! కూల్‌! కొంచెం మంచినీళ్ళు తాగు!’’వాటర్‌ బాటిల్‌ నా చేతికి అందించాడు!అది...ఓ మల్టీనేషనల్‌ సాఫ్ట్‌వేర్‌ కార్పొరేట్‌ ఆఫీస్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఛాంబర్‌! పెళ్ళి వార్త తెలిసిన తర్వాత మూడురోజులకు మన్మథరావును ఒంటరిగా ఛాంబర్‌లో పట్టుకోగలిగాను. మొదట టీమ్‌ లీడర్‌గా కెరీర్‌ ప్రారంభించి టీమ్‌ మేనేజర్‌గా, అసిస్టెంట్‌ మేనేజర్‌గా తన తెలివితేటలతో అంచెలు అంచెలుగా మన్మథరావు ఎదిగిపోయాడు.మన్మథరావు అంటే, అందంలో మన్మథుడే! అతడి డ్రెస్సింగ్‌, వాక్చాతుర్యం, బిహేవియర్‌ ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. తన టీమ్‌లో వాళ్ళతోనే కాకుండా ఇతర టీమ్‌వాళ్ళతోకూడా స్నేహంగా ఉంటూ సలహాలు ఇస్తూ ఉంటాడు. అందుచేత అందరికీ అతడంటే క్రేజ్‌! అతడువాడే ‘ఇంటిమేట్‌’ అందరినీ ఇంకా దగ్గరకు చేరుస్తుంది.‘‘నీలాంటివాళ్ళు ఎంతమందో నా చుట్టూ తిరిగారు. తిరుగుతున్నారు. తిరుగుతారు! నా పొజిషన్‌, నా ప్రొఫైల్‌, నా ఫైనాన్సియల్‌ బ్యాగ్రౌండ్‌ అంత విలువైనవి. వారిలో నువ్వొకదానివి!’’ తేలికగా నవ్వేశాడు.