ఆయనొక సినిమా రచయిత. ఎంతో మందికి రికమెంటేషన్లు చేసిన హస్తవాసి ఉన్నవాడు. వెన్నెల కూడా అలాగే ఆయనను ఆశ్రయించింది. సాక్షాత్తూ ఆ చంద్రికే ఈర్ష్యపడేంత అందం వెన్నెలది. ఆమె గొప్ప నటి అవుతుందని ఆ రచయిత ముందే ఊహించాడు. ‘తోడేళ్ళ’బారినుంచి కాపాడేందుకు తన ఇంట్లోనే రక్షణ కల్పించాడు. మహానటిని తలపింపజేసేంత గొప్పస్థాయికి ఎదిగింది వెన్నెల. మరి ఆమె జీవితం సాఫీగా సాగిపోయిందా?

వెన్నెల ఈ అమ్మాయి అంత అందంగా ఉంటుందా? లేక వెన్నెలంత అందంగా ఈ అమ్మాయి ఉందా? అనిపించింది పార్వతీశాస్త్రిగారికి ఈ అమ్మాయిని చూశాక. డెబ్భయ్యోపడిలో పడిన ఆయన ముక్కు పొడుం తీసి గట్టిగా ఓ పట్టుపట్టాడు.‘‘ఎవర్రా ఈ అమ్మాయీ?’’ అని జూనియర్‌ ఆర్టిస్ట్‌ సప్లయిర్‌ గవర్రాజుని అడిగాడు.‘‘ఈ పిల్ల తండ్రి డ్రైవర్‌ అండీ.. తల్లి కంపెనీ ఆర్టిస్ట్‌. చిన్నచిన్న వేషాలేసేది. ఈ మధ్యన పోయిందండీ... ఈ పిల్లకిప్పుడు పదహారు నిండాయి.‘‘సరే! ఇప్పుడు హీరోయిన్ని చేసెయ్యాలంటావా?’’ పార్వతీశాస్త్రి నవ్వుతూ అడిగాడు. గొప్ప రచయిత ఆయన చెప్తే పని అవుతుందని, తెల్లారిలేస్తే బస్సులెక్కి అమ్మాయిలూ అబ్బాయిలూ ఆయన ఇల్లు వెతుక్కుంటూ వచ్చెయ్యడం ఆయనకి కొత్తకాదు!‘‘ఆ తండ్రి ఈ పిల్లని ఐదువందల రూపాయలకి ప్రతి రోజూ అమ్మేస్తున్నాడండీ...’’శాస్త్రిగారు కంగుతిన్నట్లు చూశారు.

ఆమె భూమిలోకి చీల్చుకెళ్ళిపోతున్నట్లు తల ఇంకా వంచుకుంది. ‘ఇంత అందాన్ని ఆ దౌర్భా గ్యుడు...అన్నన్నా!’ అనుకున్నాడాయన.‘‘ఇలాంటి లొకాలిటీ లోకైతే వాడు రాడండీ. అందుకే మీ ఎరికలో ఏదైనా ఇల్లుంటే ఈ పిల్లని పెడ్తారని తీసుకొచ్చా’’ అన్నాడు గవర్రాజు.శాస్త్రిగారు ఆలోచించారు. ‘‘అమ్మాయీ నటిస్తావా?’’ అడిగారు.‘‘డాన్స్‌ కూడా నేర్పించిందండీ అమ్మి’’ అంది వెన్నెల.‘‘సరే. మేడమీద గదిలో ఉండు... అవకాశాలు రాకపోవు!’’ అన్నాడాయన.గవర్రాజు ఒంగి ఒంగి దణ్ణాలు పెడుతూ, ‘‘నాకు తెలుసండి మీ మనసు దొడ్డది! అందుకే ఈడికి తెచ్చాను. ఈ పిల్ల గురించే దిగులుపడుతూ పోయిందండీ తిలకం’’ అన్నాడు.‘‘అమ్మాయ్‌, వెళ్ళి సామాన్లు తెచ్చుకో’’ అన్నాడాయన. ఆరోజునుండీ వెన్నెల అక్కడే ఉండి పోయింది.జగదీశ్వరికి ఇది సుతారామూ నచ్చలేదు!