ఎప్పట్నించో రమ్మంటావున్నారని, శనాదివారాలు, పండగ కలిసొస్తే, శుక్రవారం రాత్రి తిరుపతిలో బయల్దేరి పోరుమావిళ్లలో బస్సుమారి తెల్లారేసరికి మా చిన్నాన్న మల్లికార్జునయ్య ఊరెళ్లాను. అదొక ప్రశాంతమైన చిన్న పల్లెటూరు, మెట్టప్రాంతం, చెదురు మదురుగా చెట్లు. ఊరికి పడమరగా చెరువు, దూరంగా దిగంతానికి గోడకట్టినట్టు నల్లమలకొండల వరస.ఆదివారం మధ్యాహ్నం పండగభోజనాలయ్యాక హల్లో వీధి తలుపు దగ్గర నవారు మంచం వాల్చుకొని పడుకున్నాను. ముందువసారాలో అరుగుమీద కూర్చోని కాగితాలు చూసుకుంటున్నాడు మా చిన్నాన్న. సావిత్రమ్మ పిన్ని వెనకాల వంటింట్లో సర్దుకొనే పనిలోవుంది.నిద్రపోదామనుకుంటూండగా వంటింట్లో మా పిన్నితో ఎవరో మాట్లాడేది వినపడింది. పక్కకు ఒత్తిగిలి వంటింటివైపు చూశాను. సన్నగా పొడుగ్గావున్న యిరవైయేళ్ల అమ్మాయి. 

తలస్నానం చేసిన జుట్టుతో నవ్వుతూ చలాకీగావుంది. కట్టుకున్న ముదురు నారింజరంగు కొత్తచీర మెరుస్తూంది.‘‘మల్లయ్యన్న సాయంత్రం యింటికాడ వుంటాడా అని మా అన్నలు కనుక్కోని రమ్మన్నారు సావిత్రక్కా, అందరొచ్చి మాట్లాడేదుందంట’’ అంటావుందా అమ్మాయి.‘‘నీకు లగ్నమేమన్నా కుదిరిందేమే, మీ పెద్దొదిన వరమ్మన్నా చెప్పలేదే. లేకుంటే అందరూ కట్టగట్టుకోని యెందుకొస్తారూ. నువ్వైనా చెప్పచ్చుగదా అలివేలూ, నాదగ్గిరగూడా సిగ్గా?’’ అంది పిన్ని ఆపిల్ల బుగ్గ గిల్లి.‘‘అట్లాటిదేం లేదక్కా, పండక్కని నిన్నరాత్రే మా నడిపన్నా, చిన్నన్నా, వొదినలూ వచ్చినారు. మల్లయ్యన్నను చూసిపోదామని అనుకుంటా, అంతే’’ అంది అలివేలు సిగ్గుపడి, గోడకానుకొని నిలబడి తలొంచుకొని కాలు నేలమీద రాస్తా.‘‘యెంసిగ్గే ముగ్గురన్నల ముద్దుల చెల్లెలా. మీ మల్లయ్యన్న యీ సాయంత్రంమెక్కడికీబోడు అందర్నీ రమ్మనిచెప్పు’’ అని నేను తిరుపతి నుంచి తెచ్చిన స్వీట్లు నాలుగు అలివేలు చేతిలో పెట్టింది పిన్ని. ఆ పిల్ల పెరటి తలుపులోంచి తుర్రుమని వెళ్తావుంటే ‘‘నేను పిల్లోణ్ణి చూసి వొప్పుకోందే నీ పెండ్లి జరగనీనని మీ అన్నలకు చెప్పు’’ అని వెనకాల్నుంచి అరిచింది పిన్ని.‘‘యెవరో వచ్చినట్టుందే’’ అన్నాను మంచంమీద లేచి కూర్చొని.‘‘ఆ పిల్లా? అలివేలనీ, సుబ్బారాయుడి చెల్లెలు. ముగ్గురన్నదమ్ముల తరువాత యీమే. ముందు అందరూ యిక్కడే వుమ్మడిగావుండి సేద్యం జేసుకునేవాళ్లు. చెరువుకింద దిగువకు ఐదెకరాల మడి, మిట్టమీద రెండెకరాల చేను. యేం సేద్యంలే. యీమధ్య అన్నీ అవస్తలే పాపం’’ అంది పిన్ని హాల్లోకొచ్చి.