01-09-2017: సోమాజిగూడ: కవి, సినీ గేయ రచయిత ఆరుద్ర సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. మహా కవి ఆరుద్ర జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో గురువారం కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో ఆరుద్ర-సిరివెన్నెల సీతారామశాస్త్రి సినీ సంగీత విభావరి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత కె. విశ్వనాథ్‌ హాజరై సిరివెన్నెల సీతారామశాస్త్రికి కిన్నెర-ఆరుద్ర స్మారకసాహితీ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా రమాణాచారి మాట్లాడుతూ సిరి వెన్నెల తన పాటలతో ప్రజల మనుసులు దోచుకున్నారన్నారు. కళాతపస్వి విశ్వనాథ్‌ మాట్లాడుతూ సిరివెన్నెల తనను ఆప్యాయంగా నాన్న అని పిలుస్తారన్నారు. సిరివెన్నెల మాట్లాడుతూ మహనీయుడు మహా కవి ఆరుద్ర అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించి ఆరుద్ర-సిరివెన్నెల సినీ సంగీత విభావరి అలరించింది. ప్రముఖ గాయకులు డి. విజయలక్ష్మి,సురేఖమూర్తి, వినోద్‌బాబు, టి.బాలకామేశ్వరరావులు ఆరుద్ర, సిరివెన్నె రాసిన పాటలు పాడారు.