ఎక్కడ దొరుకుతాయో ఈయనకి ఇటువంటి ఇళ్ళు సోఫాలో బట్టలు మడతపెడుతూ విసుక్కుంది వాసంతి.‘‘ఛ ఛ ఈ మూడు గదుల పోర్షన్‌లో అందంగా ఏం సర్దుకుందామన్నా లేదు. వెధవ కొంప’’ గట్టిగానే అంది.టివి చూస్తున్న మూర్తి ఒకసారి తలతిప్పి భార్యకేసి చూసి తిరిగి టివి చూడటంలో మునిగిపోయాడు.భర్త నిర్లక్ష్య ధోరణి ఇంకాస్త చికాకు పెట్టింది వాసంతిని. చేతిలో షర్ట్‌ని సోఫాలోకి విసిరికొట్టి వచ్చి భర్తకు ఎదురుగా టీపాయ్‌ మీద కూర్చుంది.‘‘పిల్లలు కనపడటం లేదే, నేను లేచేసరికి లేరు’’ అన్నాడు. భార్య కోపం ఎందుకో అతనికి తెలుసు. అయినా తెలీనట్టు అడిగాడు.‘‘ట్యూషన్‌కి వెళ్ళారు’’‘‘ఇవాళ ఆదివారం కదా’’ అన్నాడు.పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా మాస్టారు రివిజన్‌కి రమ్మన్నారట. తర్వాత వచ్చే డైలాగ్‌ ఏమిటో అతనికి తెలుసు. అందుకే ఏం మాట్లాడ లేదు మూర్తి.‘‘ఏమండీ? నే చెప్పిన విషయం ఏం చేశారు’’‘‘ఏ విషయం?’’ తెలీనట్టు అడిగాడు.‘‘ఇంటి విషయం’’.‘‘ఏ ఇంటి విషయం’’.‘‘నిజంగా మీరు మరచిపోయి అడుగుతున్నారో లేక నన్ను ఆటపట్టించడానికి అడుగుతున్నారో తెలియడం లేదు’’ అంటూ భర్తచేతిలోంచి రిమోట్‌ లాక్కుని టివి ఆఫ్‌ చేసింది.‘‘ఏదైనా నీకు అలవాటేగా ఇంకోసారి చెప’’ అన్నాడు కుర్చీలో వెనక్కి వాలుతూ భార్యని చూస్తూ.‘‘అదేనండీ మనం కొత్త ఇల్లు కొనుక్కోవడం’’‘‘నేను చెబుతూనే వున్నానుగా ఇపడిపడే కుదరదని’’‘‘మీరు అలాగే అంటూ వుండండి. 

ఈ వీధిలో నేను మొహం ఎత్తుకుని నడవలేకపోతున్నాను. ఈ పక్కింటి వాళ్ళు ఆ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వీధి చివర వాళ్ళు ఆఖరికి మన పక్క వాటా వాళ్ళు కూడా స్వంత ఇళ్ళు కట్టుకుని వెళ్ళిపో యారు. మనం ఈ ఊరు వచ్చి ఎనిమిది సంవత్స రాలైంది. అందులో ఈ ఇంట్లోకి వచ్చి అన్నే సంవత్సరాలు అయ్యాయి. అంటే మీరు కొంప కూడా మార్చలేదు. ఎలానూ ఇక్కడే స్థిరపడదాం అనుకుంటున్నాం కదా. ఇంత ఆలస్యం దేనికి?’’‘‘నిదానమే ప్రధానం అన్నారు’’ అన్నాడు.‘‘మీకేం? ఇరుగు పొరుగు వారు మనం ఎపడు ఇల్లు కట్టుకుని వెళతాం అని అడుగు తున్నారు’’‘‘వాళ్ళు కట్టిస్తారేమో కనుక్కో’’‘‘చాల్లెండి వేళాకోళం’’‘‘లేకపోతే మన ఆర్థిక పరిస్థితి ఏమిటో మనం చూసుకోకుండా ఒకళ్ళకోసం కట్టుకుంటామా ఏమన్నానా?’’‘‘నేను స్నానం చేసి వస్తాను. టిఫిన్‌ రెడీ చెయ్యి’’ అంటూ లేచి వెళ్ళిపోయాడు మూర్తి.వాసంతి నిస్సహాయంగా భర్తవంక చూసి వంటింట్లోకి నడిచింది.రెండురోజులు గడిచాయి.ఒకనాటి రాత్రి...‘‘ఏమండీ...’’‘‘చెప..’’‘‘ఇవాళ మధ్యాహ్నం మన ఇంటికి ఎదురుగా వుండే సరిత వచ్చింది. వాళ్ళ కొత్త ఇంటికి తీసుకెళ్ళి చూపించింది’’‘మళ్లీ రామాయణం మొదలు’ అనుకున్నాడు మూర్తి.‘‘ఇల్లు బాగుందా?’’ అడిగాడు.