శారదకి ఆ రోజు తెల్లవారుఝామున నాలుగు గంటలకి మెళుకువ వచ్చింది. ప్రతిరోజూ ఆ సమయానికి నిద్రలేచే ఆమె భర్త శ్రీనివాసరావు ఆదమరచి నిద్రపోతున్నాడు. నీలిరంగు బల్బు వెలుగులో మురిపెంగా భర్తని చూస్తోందామె. సుదీర్ఘమైన ఆలోచనలోకి వెళ్ళిపోయింది.ఆరడుగుల ఆజానుబాహువు. మంచి రంగు, కోలమొహం, నిరంతరం తను చురుగ్గా ఉంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళనీ అదే వేగంతో పని చేయించే నైజం, నిజాయితీ ఒక పక్క అయితే,ఆలోచన, ఆహార్యం, ఆరోగ్యవిషయాల్లో క్రమంతప్పని అలవాట్లు, ఎటువంటి క్లిష్టపరిస్థితుల్లోనూ విచక్షణ కోల్పోని విలువలు మరోపక్క.ఉద్యోగ జీవితంలో ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, ప్రమోషన్లు అందుకున్నా తొణకని బెణకని నిగర్వి.

కాకపోతే మనిషి మాటల్లో, చేతల్లో వేగం. ఆయనలో ప్లస్‌లు, మైనస్‌లు బేరీజు వేసుకుంటే, ప్లస్సులదే పైచేయి అవడం, డబ్బుకి, హోదాకి కొదవలేక పోవడంతో జీవితం ప్రశాంతంగా గడిచిపోతోంది. జాతీయ బ్యాంకులో క్రిందిస్థాయి నుండి తెలివి తేటలతో మేనేజరుస్థాయికి ఎదిగాడు శ్రీనివాసరావు. తన ఎదుగుదలకు కారణమైన సంస్థ ఎదుగుదలకు సిన్సియర్‌గా తనవంతు పాత్ర పోషించి, ఎంతోమందికి ఆసరా కల్పించాడు శ్రీనివాసరావు.కొడుకు అభిరాం, కోడలు అర్చన ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే. హైదరాబాదులోనే ఇద్దరి ఉద్యోగాలు.కూతురు స్నిగ్థ, అల్లుడు రవి ఇద్దరూ డాక్టర్లే. ఆస్ట్రేలియాలో ఉంటారు.

పదవీస్థాయిలో శ్రీనివాసరావుదే పైచేయి కావడంవల్ల పిల్లల ఫీలింగ్సు పలు పర్యాయాలు హర్టయినా, ఆయన మీదున్న గౌరవంతో, బాల్యం నుండి అలవాటుపడ్డ భయంతో ఇప్పటికీ ఆయన మాటకి ఎదురు చెప్పరు. పెళ్ళికి ముందు స్నిగ్థ అమెరికాలో ఇంటర్నల్‌ మెడిసిన్‌ చదువుతానంటే మన దేశంలో లేని చదువులా? మనదేశంలో లేని ఉద్యోగాలా అవన్నీ? అంటూ ఇక్కడే జనరల్‌ మెడిసిన్‌, డి.ఎన్‌.బి. చేయించి, యు.పి.ఎస్‌.సి. రాయించాడు. స్నిగ్ధ ఆ పరీక్షల్లో ఉత్తీర్ణురాలై రైల్వే డాక్టరుగా ఉద్యోగం తెచ్చుకుంది. ఆ తర్వాత రవితో పెళ్ళి, తర్వాత ఇద్దరూ ఆస్ట్రేలియా వెళ్ళిపోవటం, అక్కడ తనకు ఇష్టమైన ఇంటర్నల్‌ మెడిసిన్‌లో చేరటమూ జరిగిపోయాయి.