చెంప చెళ్లుమంది సుభద్రకు. అతను వెళ్లి అద్దంలో మరోమారు చూసుకున్నాడు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా పంచెకట్టు, జుబ్బా, దానిమీద కండువా. అతని మనసు నిండా భావోద్వేగాలు. చెంపదెబ్బ కొట్టింది నేనేనా.. జరగవలసింది జరిగిందా.. ప్రశ్న. కర్తృత్వ వివేచన. దుఃఖోద్వేగం మనసులోని ఇతర ఉద్వేగాలను ఒక్కక్షణం చెదిరించింది. బైటకి వచ్చాడు. డ్రైవర్‌ శాస్త్రి కారు తలుపు తీశాడు. కూర్చున్నాడు.మామూలుగా ఉండే పలకరింపు నవ్వు కోసం చూశాడు శాస్త్రి. కారు కదిలించాడు. విమానాశ్రయం వైపు కదిలింది.జరిగిందేమిటి?సాక్షాత్తు సరస్వతీ అవతారం భారతీదేవి. ఆమె అన్నమయ్యను పాడదు. అన్నమయ్య ఆమెను పూనుతాడు. భగవద్దర్శనంలోని బ్రహ్మానందం అన్నమయ్య గానం. ఆమె అదే భగవద్దర్శనానుభూతిలోనే పాడుతుంది. శ్రోతకీ అదే అనుభవం కలుగుతుంది. పెంజీకటికవ్వల నుండి అజేయుడూ అమేయుడూ నిర్గుణుడూ నిరాకారుడూ అయిన వాడి స్పర్శానుభూతి అది. కాయమంతా కన్నులై భరించటానికి సాధ్యంకాని తేజస్సులో లీనమైపోయే అనుభూతి. దానికి ప్రత్యక్షకారణం భారతీదేవి గానం. ఇదీ అతని అనుభూతి. అది విశ్వాసం అంటే అతను ఒప్పుకోడు. నీ అనుభవంలో లేనిది నా అనుభవంలో ఉండకూడదంటావా? అంటూ నిలదీస్తాడు.అటువంటి భారతీదేవిని నేరుగా కలవటమంటే భగవద్దర్శనావకాశమే గదా! ఆ సంభ్రమం తప్పా? దానిని సుభద్రతో పంచు కోవటం తప్పా? కాదే! రాత్రంతా నిద్రపట్టలేదు. సుభద్రని నిద్రపోనివ్వలేదు. ఆ కాసెట్లు.. సిడిలు వింటూంటే కలిగిన తాదాత్మ్యతని చెపుతూనే ఉన్నాడు.భారతీదేవి గాత్రాన్నీ ఆమె అందాన్నీ విడదీయటం అసంభవం. ఆమె భక్త్యావేశమే ఆమె అందంతో పోటీ పడుతుంది. ఆ రెంటితో ఆమె స్వరం పోటీ పడుతుంది. ఆ మూడింటితో ఆమె రసజ్ఞానం పోటీ పడుతుంది. ఆ సంగమమే భగవంతుని సన్నిధికి శ్రోతని తీసుకుపోతుంది. అదే ప్రత్యక్షంగా వింటే సాక్షాత్తూ భగవంతుడే ఎదుట నిలిచినట్టవదూ!సుభద్ర ఈ కాలపు ఆడాళ్లలో తప్పబుట్టింది. పతివ్రతల కోవకి చెందిన మనిషి. అలాంటి మనిషి ఈ రోజుల్లో ఉండదు. కంటికి రెప్పలా, కాలికి చెప్పులా ఉంటుంది. రాత్రంతా చెప్పినపుడు చక్కగా వింది. అర్థం చేసుకుందనే అనుకున్నాడు. ‘నిజమేనండీ చాలా బాగా పాడతారు’ అనికూడా అంది. ‘అవును చాలా అందంగా ఉంటార’నీ ఒప్పుకుంది. ‘సంగీతం గురించి రసజ్ఞానం గురించి నాకేం తెలుస్తుందండీ ఇంట్లో ఉండే దానికీ పల్లెనుంచి వచ్చిన దానికీ’ అని బాధపడింది కూడా.

                                                 ************************************************