భార్యాభర్తలన్నాక కీచులాటలుంటాయి. అవి లేకపోతే దాంపత్యంలో మజా ఉండదు. అది కొందరు దంపతులకు సత్కాలక్షేపమైతే, మరి కొందరికి లైఫ్‌ అండ్‌ డెత్‌ క్వశ్చన్‌గా ఉంటూ ఉంటుంది. ఎంత కీచులాడుకున్నా, వేరు వేరు గదుల్లో పడుకున్నా భార్యాభర్తలమధ్య కంటికి కనిపించని ఒక మానసిక ఆనుబంధం ఉంటుంది. ఇద్దరూ ఇంటి గౌరవం, ఇంటి ప్రయోజనాలనే కోరుకుంటారు. ఈ కథలో ఇలాగే ఏం జరిగిందంటే....

******************

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ విండో సీట్లో కూర్చున్న లావణ్య ముఖం ఎంతో అలసిపోయినట్టుంది.కళ్ళు ఉబ్బరించి ఉన్నాయి. ఎంత వద్దనుకున్నా ఆమెలో దుఃఖం ఆగడంలేదు. ‘‘ఊరుకో లావణ్యా! మామయ్యగారికి ఏమీ అవదు. నువ్వు ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకోకు. నువ్వసలే వట్టిమనిషివి కూడా కాదు’’ మెల్లిగా ఆమెను సముదాయిస్తూ అన్నాడు భర్త శేఖర్‌.‘‘ఏవండీ నాకెందుకో చాలా భయంగా ఉంది. జీవితాన్ని నవ్వుతూ తుళ్ళుతూ దేనిగురించీ ఎక్కువగా ఆలోచించకుండా ఓ ‘డోంట్‌ కేర్‌ మాస్టర్‌లా’ ఉండే నాన్నకు సడనుగా హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చలించని నాన్న ఇప్పుడు సి.సి.యు (కరోనరీ కేర్‌ యూనిట్‌) లో ఉన్నారంటే ఎందుకో చాలాబాధగా ఉంది. ఇంట్లో ఏదో జరగకూడని సంఘటన జరిగే ఉంటుంది. అది ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కావడంలేదు.ఆయనకు ఉన్న ఒక్కగానొక్క కొడుకూ జీవితంలో సెటిలయ్యాడు. అలాగే నాకూ చక్కగా పెళ్ళిచేసి తమ బాధ్యత తీర్చుకున్నారు. నాన్నకు కనీసం ఇంకో ఐదేళ్ళు సర్వీసు ఉంది.

ఆయనకంటూ ఓ ఇంటిని ఏర్పరచుకున్నారు. అలాగే ఆయన అన్నదమ్ములందరూ మంచి పొజిషన్లలో ఉన్నారు. చెప్పాలంటే చీకూచింతాలేని జీవితం. మరి ఇప్పుడు ఎందుకిలా జరిగిందో’’ కర్చీఫ్‌తో కళ్ళు తుడచుకుంటూ అంది లావణ్య.‘‘ఏమో ఆయనకి చెప్పలేని బాధలు ఏమున్నాయో. కారణం లేకుండా ఏదీ జరగదు’’ అన్నాడు శేఖర్‌.‘‘నిజమే మీరన్నట్లు నాన్న ఏదో తెలియని టెన్షన్‌లో ఉండి ఉంటారు. అయితే అది ఏమై ఉంటుందా అని నేను విషయం తెలిసిన దగ్గరనుండి ఆలోచిస్తున్నాను. నాన్న నా దగ్గర తమ్ముడి దగ్గర ఎప్పుడూ ఏ విషయాలు దాచరు. అయితే అమ్మ విషయం తెలిసిన నాన్న అప్పుడప్పుడు, ముఖ్యంగా డబ్బు వ్యవహారాలు మాత్రం అమ్మకు చెప్పరు. ఎందుకంటే అమ్మ అన్నింటికీ నాన్నను తప్పుపడుతూ, ‘మీరు డబ్బులూ దుబారా చేస్తున్నారు’ అని దెబ్బలాడుతూ, ‘నాతో ఏ విషయాలూ ‘షేర్‌’ చేసుకోరు. మీకంతా గుట్టే అని దెప్పుతూ ఉంటుంది అమ్మ.