అడవిలోని ఆ ఇరవై గుడిసెల్లో మగాళ్ళందరూ పొగాకు బేరన్లకి మొద్దులు నరకడానికి సైకిళ్ళకి గొడ్డళ్ళు, గునపాలు, సమ్మెటలు, అడ్డీలు అమర్చు కుంటున్నారు. సైకిల్‌ హ్యాండిళ్ళకు నాలుగు గిన్నెల క్యారేజీని బరకంతో కుట్టిన సంచిలో పెట్టి తగిలిస్తున్నారు. బావిలోంచి నీళ్ళు తోడడానికి వెళ్ళినావిడ అరుపులతో మగాళ్ళందరూ ఆ నూతి దగ్గరకు పరిగెట్టారు.

‘‘నూతిలో ఏదో ఉంది’’ అని బెదిరిపోతూ చెప్పిందావిడ.నీళ్ళలో ఏదో కదులుతుంది. మసక వెలుగులో సరిగ్గా కనబడట్లేదు. ఈలోగా ఓ ఇద్దరు బ్యాటరీ లైట్లు తెచ్చారు. కాంతిని నూతిలోకి వేసి చూశాడో ముసలాయన.‘జింక’ అని అప్రయత్నంగా అతని నోటి వెంట మాటలొచ్చేశాయి. ఆ మాట పెదవి దాటగానే గూడెంలోని చిన్నాపెద్దా - ముసలీ ముతక అందరూ నుయ్యి దగ్గరకు చేరుకున్నారు.ఇద్దరు, ముగ్గురు పెద్దలు ఒకచోట చేరి దాన్ని తాళ్ళతో బయటకు లాగాలని నిర్ణయించుకుని వాటికోసం ఒకడిని పంపారు.‘‘మొన్నామధ్య మన పక్కూరి నూతిలో దుప్పొకటి ఇలాగే పడితే దాన్ని రాళ్ళతో కొట్టి చంపి బయటకి తీసారంట. అడవి జంతువుని నేలమీద అదుపు చేయలేం. ఆలోచించుకోండి’’ అన్నాడు ముసలాయన.రాళ్ళతో కొట్టి చంపి బయటకు లాగాలని, తాళ్ళతో సజీవంగా బయటకు తీయాలని రెండు వర్గాలుగా విడిపోయి వాదులాడు కున్నారు. ఇలా గొడవ జరుగుతుండగానే పెద్దాయనొకడు పెద్ద బండరాయి తీసుకొచ్చి నూతిలోకి విసిరాడు.

అది జింకకు తిన్నగా పడుతూనే నూతిగోడ అంచుకు తగిలి దిశ మారి జింక పక్కగా నీళ్ళలో దబ్బున పడింది.తాళ్ళతో దాన్ని లాగాలని వాదించేవాళ్ళు అది చూసి చిర్రెత్తిపోయారు. గొడవ పెద్దదైంది.‘‘జింకని చంపి తీస్తే దాన్ని వాటాలేసి ఈరోజే వండుకోవాలి. అలాగ చెయ్యాలంటే ఉన్న పళాన పని మానేయాలి. అసలే రెడ్డిగారి బేరన్‌కి పుల్లల్లేవు. చెప్పాపెట్టకుండా పని మానేస్తే ఆయనగారు అగ్గిమీద గుగ్గిలమయిపోతాడు.అందుకే రేపేదో పనుందని చెప్పి పని మానేసి అందరం ఇళ్ళకాడే ఉండి దీన్ని కోసుకుని వాటాలేసుకుని తిందాం’’ అన్నాడు ముసలాయన.ఆ మాటకు అందరూ కట్టుబడ్డారు.ఒకతను బావి సగం దాకా దిగి నీళ్ళలో పీకల్లోతు మునిగి అటూఇటూ కంగారుగా కదులుతూ బెదురు చూపులు చూస్తున్న జింక మీదకు చేపలు పట్టే విసురు వల విసిరాడు. అది గుంజుకుని కదలకుండా ఆగిపోయాక నూతిలోకి పూర్తిగా దిగి దానికి తాళ్ళు కట్టి పైకి వచ్చేశాడు. అందరూ కలిసి దాన్ని లాగి ముందరి రెండు కాళ్ళు కలిపి గట్టి తాడుతో కట్టేసి, మెడకు తాడు కట్టాక వల తీసేశారు.