మునెమ్మలు ఆ వూళ్లో చానామందే వుండారు. బర్రె మునెమ్మ మాత్రం ఒక్కటే. అలా అడిగితే ఎవురైనా సరే.. ఇంటికి తోవ చూపించేస్తారు. అంతుచిక్కని రోగం కమ్మిన కొడుకు, అంతు చిక్కినా లొంగని తాగుడు మరిగిన పెనిమిటీ కలిపితే మునెమ్మ బతుకు!చీకట్తోనే ఇల్లూ వాకిలీ చిమ్మేసి, పేడా చెత్తా ఎత్తేసి, పితికిన పాలు నాలుగిళ్లలో పోసేసి, తిరిగి ఇంటికొచ్చి ఎండ సురుకెక్కకముందే పేడలో వడ్లపొట్టూ, గడ్డీ కలిపి గోడకి పిడకలు కొట్టేసి, బడికొచ్చి మొత్తం శుభ్రం చేసేసి, ఇంటికిపొయ్యి స్నానం చేసేసి వచ్చాక.. మధ్యాహ్నం పిలకాయిలందరికీ అన్నం కూరలూ వండేసి.. అయ్యోర్లకు విడిగా అన్నం వండి మిగిలిందో సగిలిందో పగిటేళకి అంత బొక్కిందంటే.. యింకంతే - పొద్దు పడమటకి మళ్లేదాకా - ఏ పొద్దు ఎవరి కయ్యలో నడుమొంచతందో! సందేళ దాకా కష్టం చెయ్యడం.. ఇల్లుజేరి పాలు పితికి మర్రోజు బడికి పెరుగు తోడు పెట్టడం.. ఆ పనుల వరసే ఆ బతుక్కి ఆదరవు.ఈతి బాధలూ సుఖాలూ, ఏడుపులూ నవ్వులూ, భయాలూ ఆశలూ సకలం నిండిన ఆమె జీవనయాత్రలో - తోబుట్టువును మించిన తోడు, మునెమ్మ బర్రె.

*****************

మునెమ్మ బర్రె, ఇప్పుడంటే ఒకటే. కానీ ఆమె ‘ఇది నా పేణం’ అంటంది. ఇది లేపోతే నేన్లేను అంటంది. ఊళ్లో ఆమెను అంతా బర్రె మునెమ్మనే అంటారు. ఇదివరకైతే నాలుగుండేవి. ‘నా అంతటి దొరసాని ఈ చుట్టుపక్కల పల్లెల్లోనే లేదు’ అనేంత బోగంగా బతుకుతుండేది మునెమ్మ. బోగం అంటే మరేంటో కాదు. నిద్దర్లేస్తే పళ్లు తోముకోని, తూరుపుకేసి చూసి, అప్పటికింకా పురుడు పోసుకోని దేవుడికి దండంపెట్టుకోడం.. గొడ్ల కొట్టాం మొత్తం శుభ్రం చేయడం.. మిగిలీ సగిలిన సద్ది ఏదైనా ఉంటే అది కూడా యేసి, తవుడు కలపడం తొలిపని. అదయ్యేకాడికి బర్రెలు ఆవులిస్తా ఉంటాయి. కాసింత వరిగడ్డో, చెనిగాకో తెచ్చి వాటి నోటికాడ విదిలించితే అసలు పని మొదలవుతుంది. ఓ పాత ఇత్తడి బకెట్లో నీళ్లు, సుబ్బరంగా కడిగిన రెండు స్టీలు బిందెలతో తయారవతంది. ఒకటి తూకుబిందె, ఇంకోటి సంకబిందె. బకెట్లో నీళ్లని పొదుగుమీద కొట్టి బాగా చేపిన తర్వాత.. రెండు కాళ్ల మీద గొంతు కూర్చోని కాళ్ల మధ్యలో తూకుబిందె బిగించి పెట్టుకుందంటే.. రెండు చేతుల్తో లయ చెదరకండా సుయ్య్‌.. సుయ్య్‌.. అని పిండడమే! రవ్వంత అటు ఇటుగా అది నిండాల్సిందే. నిండినాక దాంట్లో పాలు సంకబిందెలో పోసేది. అట్టా నాలుగు బర్రెలూ పూర్తయ్యేసరికి సంకబిందె కూడా సగానికి పైగా నిండేది. దాన్ని తీస్కెళ్లి డిపో వోళ్లకి పోసేది. పాలూ పెరుగూ నెయ్యీ పేడా పిడకా.. బర్రెలు ఇచ్చేవన్నీ, మునెమ్మ బొడ్లో ముడేసుకునే దుడ్లుగా మారిపోతుండేవి. మునెమ్మ కాడ దుడ్లే దుడ్లు! బోగం పట్టిన మహలచ్చిమి లాగుండేది.