‘‘తల్లికి కడుపులున్న బిడ్డ ఎట్లనో... రైతుకు చేను మీదున్న పంట అట్ల కద మామా. కంటి రెప్పలా కాపాడుకుంటే తప్ప బిడ్డకానీ, పంట కానీ చేతికి దక్కవు’’ పెసర చేను సాళ్ల మధ్యన దూరంగా ఉన్న పెనిమిటి నాగయ్యతో మాట్లాడుతూనే ఎండిన పెసరకాయలు గబగబా తెంపుతోంది పూలమ్మ. దూసిన పెసర కాయలు బస్తాలో వేసుకుంటూనే దట్టంగా మబ్బులు పట్టిన ఆకాశం వైపు భయం భయంగా చూస్తోంది.

ఫెఢీళ్‌... ఫెఢీళ్‌...

ఆకాశం చీలిపోయిందా అన్నట్టుగా ఉత్తరం దిక్కున ఒక్కసారిగా మెరిసింది. మెరుపు తర్వాత వచ్చిన ఉరుము మొగిలి మీద కంటే పూలమ్మ గుండెలోనే ఎక్కువగా ప్రతిధ్వనించింది. వరుసగా వస్తున్న ఉరుముల చప్పుడుకు ఉలిక్కిపడుతోంది. ఉత్తరం దిక్కు ఉరిమిందంటే కురవక మానదు. ఇవాళ వాన తప్పేటట్టు లేదని పాతికేండ్ల ఈడుకు అటు ఇటుగా ఉన్న పూలమ్మ అనుభవం హెచ్చరించింది.చిక్కగా కమ్ముకొచ్చిన మబ్బులు నిండిన ఆకాశం... చీకటి మడుగులో నల్లరేగడి బురద పూసుకున్న దున్నకుర్రలా ఉంది. చూడబోతే పెద్దవానే వచ్చేట్టుంది. వాన వచ్చిందా... పెసర చేను గంగపాలు ఐనట్టే.గౌడి బర్ల గుంపులాంటి మబ్బులు సూర్యున్ని కమ్మేయడంతో... చీకటి చిరుత పులిలా ఉరుక్కుంటూ ఒస్తోంది. ‘‘ఆరుగాలం నానాకష్టాలు పడి పండించిన పంట. తీరా నోటికాడికి వచ్చేముందు... మాయదారి వాన వల్ల చేతికి అందకుండా పోతుందే...’’ అని క్షణక్షణం కుమిలిపోతోంది పూలమ్మ.ఇంత జరుగుతున్నా ఉలుకు పలుకూ లేకుండా నిమ్మలంగా ఇంకో సాలులో పెసరకాయలు తెంపుతున్న నాగయ్యను కేకేసింది.

‘‘ఓ అయ్యా... నా మాటలు చెవిన పడుతున్నయా. దరిద్రుడు తలకడగబోతే వడగండ్ల వాన కురిసిందట. అట్లనే ఉంది మన యవసాయం. ‘‘నలుగురు కూలోళ్లను తీసుకునిరా. రెండు రోజులల్ల ఐపోయేతదని మొత్తుకున్న.. మాట ఇన్నవా. ఏ కూలోళ్లు ఎందుకు? మనమే ఏరుకుందాం అంటివి.. ఇపుడు చూడు. వాన ముసురు పెట్టి పెసరచేను తడిసిపోతే ఏమన్న పనికొస్తదా? పెసళ్లన్ని తడిసిపోయి బూజు పడతయి. బర్లకు కుడితిల పోయాల్సిందే..’’‘‘కూలోల్లేమన్నా... మీ తాత చుట్టాలా, పుణ్యానికొస్తరా! మనిషికి ఐదొందలన్నా ఇయ్యాలె. లేదంటే ఏరిన పెసళ్లు సగం వాళ్లకే ఇయ్యాలె. ఒక్కనాడు ఏరిన కూలోళ్లకే సగం పంట ఇస్తే దున్ని, గింజలేసి, పంట పండించిన మనకు మిగిలేది ఏముంటది? ఒక నాడు అటో, ఇటో ఆల్చం ఐనా మనమే ఏరుకుందాం’’ పెసరకాయలు దూసుకుంటూ నింపాదిగా చెప్పిండు నాగయ్య.