చిమ్మ చీకటి.వాతావరణం చల్లగా ఉంది.ఆకాశం నిండా చుక్కలు గుత్తులుగా వేలాడుతున్నాయి.అర్ధరాత్రి దాటుతోంది.పడవ, చప్పుడు లేకుండా రొయ్యల చెరువులో కదులుతోంది.రెండు నల్లటి ఆకారాలు కనిపిస్తున్నాయి.ఏసు ఫ్లాష్‌ లైట్‌ వేసి నీటిపైన చూస్తున్నాడు. గన్‌లో తుపాకీ మందు రవ్వలు కూరి, గురిపెట్టుకొని చూస్తున్నాడు విబ్రో.సైగ చేశాడు విబ్రో.పడవ ఆగిపోయింది. చిన్నగా ఈల. లైటు ఆరిపోయింది, తుపాకీ పేలింది. రవ్వలు దూసుకు పోయాయి.

ఇప్పుడు లైటు వేసి ఆచోటంతా వెతికారు, రెండు బుడ బుచ్చ కాయిలు తేలాయి. మరో కొంత సేపు వేట సాగింది. మరో మూడు పిట్టలు దొరికాయి.‘‘ఈరోజుకు చాలు, మరో రెండు రోజుల్లో రాత్రివేట చేద్దాం’’ అన్నాడు విబ్రో.ఉదయానికి యజమాని సాయిరాజుకు చంపిన పిట్టల్ని చూపిస్తే సంతోషపడతాడని విబ్రోకి అనిపించింది. మరి ఈ వేటకోసమే విబ్రోని తీసుకువచ్చింది. రొయ్యల చెరువుల్లో ఎన్నో సమస్యలు - అవన్నీ సాయిరాజు చూసుకోగలడు కానీ ఈ పిట్టల సంగతి తానే చూడాలి.బుడ బుచ్చకాయిలు, నీటిమీద వాలే చిన్నపిట్టలు. మహా అయితే పిచ్చుకల కంటే కొంచెం పెద్దవి. బాతు పిల్లల సైజులో ఉంటాయి. ముదురు, లేత గోధుమరంగులలో ముద్దొస్తూ ఉంటాయి. నీటిమీద తేలుతూ, మధ్య మధ్యలో నీటిలో మునిగి ఓ నిమిషం ఉండి, ఏదో ఒక చేపపిల్లో రొయ్యపిల్లనో నోట కరుచుకొని పైకి లేస్తాయి.

కొల్లేరు ప్రాంతంలో, అక్కడక్కడా నీటి చెలమల దగ్గర కనిపిస్తాయి. అక్కడున్న జమ్ము పొదల్లో గూడు కట్టుకొని బతుకుతాయి. ఇతర పిట్ట జాతులతో పోలిస్తే తక్కువే కనిపిస్తాయి. చిన్ని ఈల వేసినట్టుగా వీటి కూతలు ఉంటాయి. పైగా వీటిని మనుషులు తినటానికి ఇష్టపడరు. ఏ బురద పాములకో, బావురు పిల్లులకో, గెద్దలకో బలవుతూ ఉంటాయి.ఇప్పుడు ఈ ప్రాంతమంతా చేపలు, రొయ్యలచెరువులతో నిండిపోయింది. ఈ చిన్న పిట్టలకు కూడా ఈ చెరువులే ఆధారమయ్యాయి. రైతులకు కొత్త సమస్య ఎదురయ్యింది. వారు చేసే విచ్చలవిడి రొయ్యలసాగు వల్ల కొత్తగా వైరస్‌ సమస్య పెరిగిపోయింది. వైరస్‌ జబ్బు సోకిన కొన్నిగంటల్లోనే రొయ్యలు పట్టాల్సిందే .. మందులేమీ పనిచేయవు.